దేశమంతా కొత్త హెల్త్ స్కీం: రాహుల్​

దేశమంతా కొత్త హెల్త్ స్కీం: రాహుల్​

వయనాడ్: దేశంలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పెద్ద రోగాలొస్తే పేదలకు చావే దిక్కు అన్నట్టుగా పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద రోగాలకు బలవుతున్న బాధితులు ఎక్కువ మంది పేద ప్రజలేనని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో హెల్త్ కేర్ సిస్టమ్​ను పునఃపరిశీలించి, బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్థాన్​లో తమ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ‘చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్’ అద్భుతంగా ఉందని, తాము 2024లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ తరహా స్కీమ్​ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

గురువారం కేరళలోని వయనాడ్​లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ ను రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. ఆ సమయంలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని తెలుసుకున్నాను. క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి పెద్ద రోగాలస్తే ఇక జీవితం ముగిసినట్టేననే దుస్థితి నెలకొంది” అని రాహుల్ ఆవేదన చెందారు. 

అసలేంటీ స్కీమ్? 

రాజస్థాన్​లోని కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్​ను అమలు చేస్తోంది. దీని కింద పేదలు, మధ్య తరగతి ప్రజలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. క్యాన్సర్, గుండె జబ్బుల లాంటి పెద్ద రోగాలకు ఫ్రీ ట్రీట్ మెంట్ పొందడంతో పాటు కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు, డయాలసిస్ చేయించుకోవచ్చు. కాగా, రాజస్థాన్ లో మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద కవరేజీని రూ.50 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.