కార్పొరేట్‌‌ టాక్స్‌‌ తగ్గింపుతో కార్ల సేల్స్ పై  కొత్త ఆశలు

కార్పొరేట్‌‌ టాక్స్‌‌ తగ్గింపుతో కార్ల సేల్స్ పై  కొత్త ఆశలు

న్యూఢిల్లీ: తమ రంగానికి జీఎస్టీ తగ్గించలేదని ఆటోమొబైల్‌‌ కంపెనీలు బాధపడుతున్నప్పటికీ, కార్పొరేట్ టాక్స్‌‌ తగ్గింపు వల్ల వీటికి ఎంతో మేలు జరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. నష్టాల నుంచి కోలుకోవడానికి అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కార్పొరేట్‌‌ టాక్స్‌‌ పది శాతం తగ్గడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. మిగులు ఆదాయం పెరుగుతుంది కాబట్టి, లాభాల్లో ఉన్న ఆటో కంపెనీలు టూవీలర్లు, ఫోర్‌‌ వీలర్ల ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది. దసరా, దీపావళి సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీలకు కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వల్ల గత ఏడాదిగా ఇబ్బందిపడుతున్న వాహన విడిభాగాల రంగం కూడా ప్రయోజనం పొందనుంది.

ప్రైవేటు కంపెనీల వినియోగాన్ని, డిమాండ్‌‌ను పెంచడానికి మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌‌ టాక్స్‌‌ను 30 శాతం 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అన్ని సెస్‌‌లు కలుపుకుంటే ఇక నుంచి కంపెనీలు 25 శాతం మాత్రమే టాక్స్ కట్టాలి. పన్నుభారం తగ్గడం వల్ల మిగిలే డబ్బును ఆర్‌‌ అండ్‌‌ డీ వంటి అవసరాలకు వాడుకోవచ్చు. వాహన అమ్మకాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయిన పరిస్థితుల్లో ట్యాక్స్‌‌కట్‌‌ ఆటో కంపెనీల సెంటిమెంట్‌‌ను పెంచడం ఖాయమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ–50లో శుక్రవారం టాప్ 5 గేనర్స్‌‌లో మూడు ఆటో కంపెనీల షేర్లే ఉండటమే ఇందుకు నిదర్శనం. ఐషర్‌‌ మోటార్స్‌‌ స్టాక్‌‌ ఏకంగా 13.38 శాతం పెరిగింది. హీరో మోటోకార్ప్‌‌ 12.34 శాతం, మారుతీ సుజుకీ ఇండియా 10.54 శాతం పైకి ఎగిశాయి.

అమ్మకాలు కుదేలు

మనదేశంలో ఆటోమొబైల్‌‌ అమ్మకాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఇండియాలో టాప్‌‌–6 ఆటో కంపెనీల అమ్మకాలు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి 34 శాతం తగ్గాయి. 2018 ఆగస్టులో 2.60 లక్షల యూనిట్లు అమ్మితే, ఈసారి వీటి సంఖ్య 1.71 లక్షలకు తగ్గింది. ఇండియాలోనే అతిపెద్ద వెహికిల్‌‌ కంపెనీ మారుతీ సుజుకీ డిమాండ్‌‌ లేక మూడు ప్లాంట్లలో ప్రొడక్షన్‌‌ను 39 శాతం వరకు తగ్గించింది. వరుసగా ఏడు నెలలుగా డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరికొన్ని కంపెనీలు కూడా ప్లాంట్లను మూసివేసి, కాంట్రాక్టు కార్మికులను ఇంటికి పంపించాయి. దేశవ్యాప్తంగా వెహికిల్‌‌ షోరూమ్‌‌ల డీలర్లు దాదాపు 20 లక్షల మందిని తొలగించారని సియామ్ వంటి సంస్థలు తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత మంది ఉద్యోగాలు పోకతప్పదని హెచ్చరించాయి. వాహన ధరలు తగ్గితే అమ్మకాలు పెరుగుతాయి కాబట్టి వీటిపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని పలుసార్లు కేంద్రమంత్రులను కోరాయి. జీఎస్టీ మండలి మాత్రం ఈ వినతిని తోసిపుచ్చింది.

ఇండియాలో తయారు చేస్తే ఇంకా మేలు

ఇండియాలోనే పూర్తిగా వాహనాలను తయారు చేసే కంపెనీలు కేవలం 15 శాతం టాక్స్‌‌‌‌ కడితే సరిపోతుంది. అయితే, ఇవి 2023 మార్చిలోపు ప్రొడక్షన్‌‌‌‌ను మొదలుపెట్టాలి. మిగులు ఆదాయాన్ని ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికిల్స్‌‌‌‌ను తయారీకి వాడుకోవచ్చు. ఇప్పుడున్న మోడల్స్‌‌‌‌ను మరింత అభివృద్ధి చేయవచ్చు. అన్ని సెస్‌‌‌‌లు కలుపుకున్నా ఇలాంటి కంపెనీలు చెల్లించే పన్నుమొత్తం 17.5 శాతం దాటదు. ఇండియాలో ఆర్ అండ్‌‌‌‌ డీ, వాహనాల తయారీని పెంచడానికి ఆటో కంపెనీలు చెల్లించే మినిమం ఆల్టర్నేట్‌‌‌‌ టాక్స్‌‌‌‌ (మ్యాట్‌‌‌‌)ను తాజాగా 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. ఈ విషయమై మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఆర్‌‌‌‌.సి.భార్గవ మాట్లాడుతూ ‘‘కార్పొరేట్‌‌‌‌ టాక్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆటో కంపెనీలు ఇబ్బందిపడ్డాయి. తాజా నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం రెండు ముఖ్యమైన సందేశాలు పంపింది. ఎకానమీ నెమ్మదించడాన్ని ఆపడం ఒకటోది. కార్పొరేట్‌‌‌‌ టాక్స్‌‌‌‌ తగ్గింపు వల్ల కంపెనీలకు ఎంతో డబ్బు ఆదా అవుతుందనేది రెండోది. తమ ప్రొడక్ట్స్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెంచుకోవడానికి ఈ మిగులు నిధులను ఆటో కంపెనీలు వాడుకోవచ్చు’’ అని అన్నారు. సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్‌‌‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌‌‌ (సియామ్‌‌‌‌) ప్రెసిడెంట్‌‌‌‌ రాజన్‌‌‌‌ వధేరా కూడా కేంద్రం నిర్ణయంపై సంతోషం ప్రకటించారు. టాక్స్‌‌‌‌ తగ్గింపు ఎకానమీకి తప్పక మేలు చేస్తుందన్నారు. ఆర్ అండ్‌‌‌‌ డీ, ఇంక్యుబేషన్‌‌‌‌ సెంటర్ల కోసం కంపెనీలు మరింత ఖర్చు చేయగలుగుతాయని అన్నారు.

ట్యాక్స్‌ కట్‌ తో లాభం లేదు: మూడీస్ 

కార్పొరేట్‌‌ టాక్స్‌‌ను తగ్గించడం వల్ల  ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పవని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌‌  హెచ్చరించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల భారం పడుతుంది కాబట్టి ద్రవ్యలోటు పెరుగుతుందని తెలిపింది. ట్యాక్స్‌‌ కట్‌‌ వల్ల కంపెనీల ఆదాయం పెరుగుతుందని, సులువుగా అప్పు పుడుతుందని పేర్కొంది. అయితే, ద్రవ్యలోటు టార్గెట్‌‌ను అందుకోవడం ప్రభుత్వానికి సాధ్యం కాదని విమర్శించింది. ‘‘ఇటీవల ఆర్‌‌బీఐ కేంద్రానికి ఇచ్చిన మిగులు నిల్వలను కలిపినా అవి జీడీపీలో 0.3 శాతాన్ని కూడా మించవు. రెవెన్యూ నష్టాలను తగ్గించుకోవడానికి ప్రభుత్వానికి ఖర్చులను అదుపు చేసే అవకాశం ఉండదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు, బలహీన కార్పొరేట్‌‌ సెంటిమెంట్‌‌, ఆర్థికరంగానికి క్రెడిట్‌‌ తగ్గడం వంటివి సమీప భవిష్యత్‌‌ వృద్ధికి ఆటంకాలవుతాయి. ట్యాక్స్ కట్‌‌ వల్ల ఐటీ వంటి నాన్‌‌–ఫైనాన్షియల్‌‌ కంపెనీలు ఎక్కువగా బాగుపడతాయి. మిగులు ఆదాయాన్ని కంపెనీలు ఎలా ఖర్చు పెడతాయనేదాని ఆధారంగా దాని క్రెడిట్ ప్రొఫైల్‌‌ మారుతుంది. ఈ డబ్బును పెట్టుబడులకు ఉపయోగించాలి. అప్పులు తీర్చడానికి, వాటాదారుల ఆదాయం కోసం ఖర్చు చేస్తే క్రెడిట్‌‌ ప్రొఫైల్‌‌ మెరుగుపడదు’’ అని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో నాన్‌‌ ఫైనాన్షియల్‌‌ కంపెనీలకు పన్నుకు ముందు 35 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆదాయం ఉంటే, ట్యాక్స్‌‌కట్‌‌ వల్ల వాటికి మూడు బిలియన్‌‌ డాలర్లు ఆదా అవుతాయి.

New hopes on car sales with corporate tax reduction