ఐటీ రిటర్న్​ ఫారాల్లో మార్పులొచ్చాయ్‌‌

ఐటీ రిటర్న్​ ఫారాల్లో మార్పులొచ్చాయ్‌‌

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ రిటర్న్స్‌‌ (ఐటీఆర్‌‌) ఫారాల్లో పలు మార్పులుచేర్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీఆర్‌‌లు నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఐటీఆర్‌‌లను ఆటో–ప్రాసెసింగ్‌‌ చేయడం, పన్ను ఎగవేతలను మరింత సమర్థంగా గుర్తించేలా ఐటీఆర్‌‌ విధానాన్ని మార్చారని ట్యాక్స్‌‌ప్యానర్‌‌డాట్‌‌కామ్‌‌ సీఎఫ్‌‌ఓ సుధీర్‌‌ కౌషిక్‌‌ చెప్పారు. ‘‘తక్కువ ఆదాయం కలిగిన వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా పన్ను చట్టాలను సవరించారు. సెక్షన్‌‌ 87ఏ కింద రిబేట్‌‌ పొందవచ్చు. సెక్షన్‌‌ టీటీబీ ప్రకారం సూపర్‌‌ సిటిజన్లకు (80 ఏళ్లు దాటిన వారు) ప్రయోజనాలు ఉంటాయి. లిస్టెడ్‌‌ ఈక్విటీ షేర్లపై లాంగ్‌‌ టర్మ్‌‌ క్యాపిటల్‌‌ గెయిన్‌‌పై, విదేశీ ఆదాయంపై పన్ను కట్టాల్సి ఉంటుంది’’ అని ఆయన వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా ఐటీఆర్‌‌ పత్రాల్లో మార్పులు చేశారు. అవేంటో చూద్దాం.

కాగితరూపంలో కుదరదు

గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ పరిధిలోకి వచ్చే సూపర్‌‌ సిటిజన్స్‌‌ సహా వ్యక్తులందరూ ఎలక్ట్రానిక్‌‌–ఐటీఆర్‌‌ సమర్పించడం తప్పనిసరి. కాగితం రూపంలో అందించడాన్ని నిషేధించారు. ఐటీఆర్‌‌ ఫారం 2లో అత్యధికంగా మార్పులు ఉన్నాయి. ఐటీఆర్‌‌ 1 ఫారంలో ముఖ్యమైన మార్పు ఉంది. కంపెనీలో డైరెక్టర్‌‌గానీ లేదా అన్‌‌లిస్టెడ్‌‌ కంపెనీలో షేర్లు ఉన్న వాళ్లు ఐటీఆర్‌‌ ఫారం–1ను ఉపయోగించడం సాధ్యం కాదు. ఇలాంటి వారి వార్షికాదాయం రూ.50 లక్షల కంటే తక్కువగా ఉన్నా ఐటీఆర్‌‌ ఫారం–1ను ఉపయోగించడానికి అనుమతించరు. కంపెనీల డైరెక్టర్ల నుంచి, అన్‌‌లిస్టెడ్‌‌ కంపెనీల షేర్‌‌హోల్డర్ల నుంచి సెంట్రల్‌‌ బోర్డ్‌‌ ఆఫ్ డైరెక్ట్‌‌ ట్యాక్సెస్‌‌ (సీబీడీటీ) అదనపు సమాచారాన్ని సేకరించాలనుకోవడమే ఇందుకు కారణం.

డైరెక్టర్లు అన్ని వివరాలూ పొందుపర్చాలి

కంపెనీ డైరెక్టర్లు వెల్లడించాల్సిన సమాచారం గురించి ఐటీఆర్‌‌ ఫారం–2ను సవరించారు. ఇలాంటి ట్యాక్స్‌‌పేయర్లు కంపెనీ పేరు, దాని ప్యాన్‌‌ నెంబరు, డైరెక్టర్‌‌ గుర్తింపు సంఖ్యను ఐటీశాఖకు తెలియజేయాలి. అన్‌‌లిస్టెడ్‌‌ కంపెనీల్లో షేర్లు ఉంటే, ఆ కంపెనీ పేరు, షేర్ల ఓపెనింగ్‌‌ నంబర్‌‌, ధర, సంఖ్య, అమ్మిన వాటి సంఖ్య తదితర వివరాలన్నీ ఇవ్వాలని ఎన్‌‌ షా అసోసియేట్స్ ఎల్‌‌ఎల్‌‌పీ పార్ట్‌‌నర్‌‌ గోపాల్‌‌ బోహ్రా వివరించారు. గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో స్థిరాస్తి లేదా క్యాపిటల్‌‌ ఆస్తులను అమ్మితే ఐటీఆర్‌‌ ఫారం2లో వాటిని కొన్న వ్యక్తి వివరాలు ఇవ్వాలి. ఐటీఆర్‌‌–1 ద్వారా జీతం వివరాలను ఇవ్వడాన్ని సులభంగా మార్చారు. ఫారం–6తో ఐటీఆర్‌‌–1ను అనుసంధానం చేశారు. ఫారం–16లో 16ఏ, 16బీ అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ మార్పుల కారణంగా ఫారాలు నింపేటప్పుడు ట్యాక్స్‌‌ఫైలర్స్ పొరపాట్లు చేసే అవకాశం ఉందని కౌషిక్‌‌ అన్నారు. కొత్త ఐటీఆర్‌‌–2 ప్రకారం వ్యక్తులు ఐటీ చట్టంలోని సెక్షన్‌‌ 6(1) ప్రకారం తమ నివాసస్థాయిని తప్పకుండా తెలియజేయాలి. విదేశాల్లో ఉంటున్న వారు ఆ దేశం పేరు, అక్కడి పన్ను చెల్లింపుదారుడి సంఖ్యను వెల్లడించాలి. ఇండియా మూలాలు ఉన్న వ్యక్తి అయితే మనదేశంలో ఎంత కాలం ఉన్నదీ పేర్కొనాలి. ఐటీఆర్‌‌–1లో ఇక నుంచి ఆదాయాలతోపాటు వాటి వనరుల వివరాలను వెల్లడించాలి. ఐటీఆర్‌‌ పత్రాలు నింపేటప్పుడు ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకోవాలని పన్నులరంగ నిపుణులు
చెబుతున్నారు.