నెలరోజుల్లో హైకోర్టుకు కొత్త జడ్జిలు

నెలరోజుల్లో హైకోర్టుకు కొత్త జడ్జిలు
  • ఇటీవల నియమితులైన జడ్జిలతో కలిపి మొత్తం 19 మంది
  • గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  సీజే సతీశ్​ చంద్ర శర్మ వెల్లడి


హైదరాబాద్, వెలుగు: హైకోర్టుకు నెల రోజుల్లో కొత్త జడ్జిలు వస్తారని హైకోర్టు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీశ్​ చంద్ర శర్మ చెప్పారు. ఇటీవల నియమితులైన జడ్జిలతో కలిపి మొత్తం 19 మంది ఉన్నారని, వీరిలో హైకోర్టు చరిత్రలో తొలిసారిగా ఆరుగురు మహిళలు ఉన్నారని వివరించారు.  జిల్లాల్లోని జడ్జిల్లో 52 శాతం మహిళలు ఉండటం హర్షణీయమని, 434 మంది జడ్జిల్లో 221 మంది మహిళలే ఉన్నారని చెప్పారు. బుధవారం రిపబ్లిక్‌‌‌‌ డే సందర్భంగా హైకోర్టులో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుడు 66 జూనియర్‌‌‌‌ సివిల్‌‌‌‌ జడ్జిల పోస్టుల భర్తీతో మొత్తం 227 మంది ఉన్నారని, మరో 4 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. కరోనా వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే కాకుండా చివరి మూడు నెలలు ఫిజికల్‌‌‌‌ హియరింగ్‌‌‌‌ కూడా చేశామని చెప్పారు. నిరుడు 57 వేల కేసులు దాఖలైతే 40 వేల కేసులు పరిష్కారమయ్యాయన్నారు. అమర జవాన్​ కల్నల్‌‌‌‌ సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌ తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌‌‌‌ను సీజే సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యాక్రమంలో ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్, బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ నర్సింహారెడ్డి, బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ అశోక్‌‌‌‌గౌడ్‌‌‌‌  పాల్గొన్నారు.