కొత్త కాలేజీల్లో పోస్టులపై ‘ఫైనాన్స్’ కొర్రీ

కొత్త కాలేజీల్లో పోస్టులపై ‘ఫైనాన్స్’ కొర్రీ

 

  • 18 కాలేజీల్లో 311 పోస్టులకు ఇంటర్ అధికారుల ప్రపోజల్ 
  • 157 పోస్టుల మంజూరుకే ఆర్థిక శాఖ అంగీకారం!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మంజూరైన సర్కారు జూనియర్ కాలేజీల్లో పోస్టుల శాంక్షన్ పై సందిగ్ధత నెలకొంది. ఇంటర్మీడియెట్ అధికారులు ప్రతిపాదించిన పోస్టుల సంఖ్యకు, ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. దీంతో కొత్త కాలేజీల నిర్వహణపై అయోమయం నెలకొంది. 

రాష్ట్రంలో 2023–24, 2024–25 విద్యాసంవత్సరాల్లో ఏర్పాటు చేసిన 18 సర్కారు జూనియర్ కాలేజీల్లో 311 పోస్టుల శాంక్షన్ కు ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషరేట్ అధికారులు.. సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. దీంట్లో ప్రిన్సిపాల్స్ 18 పోస్టులు, పీడీలు, లైబ్రేరియన్​లు, సీనియర్ అసిస్టెంట్లు18 పోస్టుల చొప్పున ప్రపోజల్స్ పంపించారు. వీటితో పాటు మరో 239 జూనియర్ లెక్చరర్ పోస్టులకు అనుమతి ఇవ్వాలని కోరారు.

 అయితే, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ మాత్రం ఇన్ని పోస్టులను భర్తీ చేసేందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ప్రిన్సిపాల్ సహా అన్ని పోస్టులను 9 చొప్పున మంజూరు చేసినట్టు సమాచారం. అన్ని కలిపి ఈ ఏడాది కేవలం157 పోస్టులకు మాత్రమే అనుమతి ఇస్తామని, వచ్చే ఏడాది మరిన్ని పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇది తెలిసిన లెక్చరర్ యూనియన్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుపోయినా.. ఇప్పటికీ స్పష్టత కరువైంది. ఇదే సర్కారు పాలసీ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు.

 మరోవైపు దాదాపు సగం పోస్టులకు కోత విధించడంతో కాలేజీల నిర్వహణపై అధికారుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అవసరమైన సంఖ్యలో  లెక్చరర్లు, సిబ్బంది లేకుండా కాలేజీలో బోధనా, పరిపాలనా కార్యకలాపాలు సజావుగా సాగడం కష్టం అవుతుందని వారు చెప్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై జోక్యం చేసుకొని, అన్ని పోస్టులు మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారు.