- కరీంనగర్ కు ఎమ్మెల్యే సత్యం
- సిరిసిల్లకు సంగీతం శ్రీనివాస్
- జగిత్యాలకు గాజెంగి నందయ్య
- పెద్దపల్లికి ఎమ్మెల్యే మక్కాన్సింగ్ కు రెండోసారి అవకాశం
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్, జిల్లాలోని నాలుగు డీసీసీలతోపాటు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కమిటీకి కొత్త ప్రెసిండెట్లను నియమమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్, జగిత్యాల అధ్యక్షుడిగా గాజెంగి నందయ్య నియమితులయ్యారు.
కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా వైద్యుల అంజన్ కుమార్ ను నియమించారు. రామగుండం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టుకు ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా మక్కాన్ సింగ్ కు రెండోసారి అవకాశం దక్కింది. జగిత్యాల డీసీసీ అధ్యక్ష పదవిని తన అనుచరుడు నందయ్యకు కట్టబెట్టడంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడైన అంజన్ కుమార్ ను వరించింది. డీసీసీ లేదా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టును ఆశించిన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావుకు నిరాశే ఎదురైంది.
బీసీలకు పెద్దపీట..
కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు పెద్దపీట వేసింది. కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించగా.. జగిత్యాల, సిరిసిల్ల పదవులను పద్మశాలీ సామాజిక వర్గానికి ఇచ్చింది. పెద్దపల్లి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టులను కూడా బీసీలకే కేటాయించడం విశేషం.
