
- 8 ఎంపీటీసీ స్థానాలు కూడా.. నిర్మల్జిల్లాలో ఒక స్థానం
- కొత్తగా తొమ్మిది గ్రామ పంచాయతీలు ఖరారు
- ఎట్టకేలకు ఐదేండ్ల తర్వాత ఉట్నూర్ లో పంచాయతీ ఎన్నికలు
- ఎన్నికల ప్రక్రియ స్పీడప్ చేసిన అధికారులు
ఆదిలాబాద్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ, వార్డు స్థానాలను ఖరారు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 20 జడ్పీటీసీ, 20 ఎంపీపీ, 166 ఎంపీటీసీ స్థానాలు, 473 గ్రామ పంచాయతీలను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం.. కొత్తగా 3 జడ్పీటీసీలు, 9 ఎంపీటీసీ స్థానాలు, ఐదు గ్రామ పంచాయతీలు పెరిగాయి. 2019లో 158 ఎంపీటీసీ, 17 జడ్పీటీసీ,158 ఎంపీటీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఆ తర్వాత కొత్త మండలాల ఏర్పాటుతో జనాభా ప్రాతిపాదికన కొత్తగా ఎంపీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. గతంలో 468 గ్రామ పంచాయతీలుండగా ప్రస్తుతం 473కు చేరాయి. వీటితోపాటు 3,870 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మంచిర్యాల మున్సిపల్.. కార్పొరేషన్లో కలిసిపోవడంతో ఎంపీటీసీ, పంచాయతీల సంఖ్య తగ్గింది. జిల్లాలో గతంలో 132 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 129కి, గ్రామ పంచాయతీలు 311 ఉండగా 306కు తగ్గాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఎలాంటి మార్పులు జరుగలేదు. నిర్మల్ జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానం, నాలుగు గ్రామ పంచాయతీలు పెరిగాయి.
ఇటు అధికారులు.. అటు ఆశావహులు
2024 ఫిబ్రవరిలో పంచాయతీ, జూన్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఆ స్థానాలను బుధవారం ఖరారు చేసింది. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. రిజర్వేషన్లు సైతం ఖరారు చేయడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. దీంతో ఏర్పాట్లలో అధికారులు బిజీ కాగా.. ఇటు ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీల పెద్దలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
2019లో ఉట్నూర్లో జరగని ఎన్నికలు
పదేండ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాదాపు 26 వేలపైగా జనాభా ఉంది. 18 వార్డులున్న ఈ పంచాయతీకి 2014లో ఎన్నికలు జరిగాయి. 15 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2019లో ఉట్నూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలనుకోవడంతో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. అయితే ఎన్నికల తర్వాత ఆదివాసీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో 2022లో ఉట్నూర్ను గ్రామ పంచాయతీగానే మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈసారి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నం
ప్రభుత్వం స్థానిక సంస్థలను ఖరారు చేయడంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల సామగ్రి, సిబ్బంది విధుల కేటాయింపు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతోనే అన్నీ సిద్ధం చేసుకుంటున్నం.
జితేందర్ రెడ్డి, జడ్పీ సీఈవో, ఆదిలాబాద్
ఉమ్మడి జిల్లాలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు
జిల్లా జడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీలు
ఆదిలాబాద్ 20 166 473
నిర్మల్ 18 157 400
మంచిర్యాల 16 129 305
ఆసిఫాబాద్ 15 127 335