భూ వివాదాలపై ధరణిలో కొత్త ఆప్షన్‌

భూ వివాదాలపై ధరణిలో కొత్త ఆప్షన్‌
  • భూ వివాదాలపై ధరణిలోనే ఆప్షన్‌
  • సమస్య పరిష్కారానికి ‘అప్లికేషన్​ ఫర్​ ల్యాండ్​ మ్యాటర్స్​’ ఆప్షన్​
  • దరఖాస్తు చేసుకుంటే నేరుగా కలెక్టర్​ లాగిన్​లోకి అప్లికేషన్​
  • ధరణిలో లక్ష దాటిన వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్​

హైదరాబాద్​, వెలుగు: భూవివాదాల పరిష్కారం కోసం ధరణిలోనే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పోర్టల్​లో ‘అప్లికేషన్​​ఫర్​​ల్యాండ్​ మ్యాటర్స్’ అనే ఆప్షన్​ ఇచ్చింది. సమస్య ఉన్నవాళ్లు ఆ అప్లికేషన్​ పెట్టుకుంటే ఆ ఫిర్యాదు నేరుగా కలెక్టర్​ లాగిన్​లోకి చేరనుంది. పోర్టల్​లో లాగిన్​ అయ్యాక సిటిజన్​ డాష్​బోర్డులో రెండో ఆప్షన్​గా ఉండే ‘అప్లికేషన్​​ఫర్​​ల్యాండ్​ మ్యాటర్స్​’పై క్లిక్​ చేసి.. పేరు, ఫోన్​ నెంబర్​, ఆధార్​ నెంబర్​, అడ్రస్​తో పాటు వివాదం ఉన్న భూమికి సంబంధించిన ప్రాంతం, సర్వే నెంబర్​ వివరాలను నమోదు చేయాలి. పట్టాదారు పాస్​బుక్​ ఉంటే ఆ వివరాలనూ ఎంటర్​ చేయొచ్చు. ఆ తర్వాత తమ వివాదం సరిహద్దు (గెట్టు), విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదం, పట్టాదారు పాస్​బుక్​ సమస్యకు సంబంధించినది అయితే ఆ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఇవేవీ కాకపోతే ‘ఇతర’ అనే ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోవాలి. ఆ తర్వాత కింద ఉండే బాక్స్​లో వివాదానికి సంబంధించి 300 అక్షరాలకు మించకుండా వివరణ రాయాలి. ఆ వివాదానికి సంబంధించి తమ దగ్గర ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే అప్​లోడ్​ చేసి సబ్​మిట్​ చేస్తే దరఖాస్తుదారుకు రశీదు వస్తుంది. తర్వాత కలెక్టర్​ వద్దకు వెళ్లే ఆ దరఖాస్తును.. కలెక్టర్​ నేతృత్వంలోని రెవెన్యూ ట్రిబ్యునళ్లు పరిశీలించి వివాదాలను పరిష్కరిస్తాయి.

2,672 నాలా కన్వర్షన్లు

ధరణి ద్వారా చేపట్టిన అగ్రికల్చర్​ ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య బుధవారం నాటికి లక్ష దాటింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నవంబర్​ 2 నుంచి కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 570 తహసీల్దార్‌‌‌‌ ఆఫీసుల్లో జాయింట్​ సబ్​ రిజిస్ట్రార్​​హోదాలో తహసీల్దార్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వ్యక్తులు ఆన్​లైన్​లో ​స్లాట్​బుక్​​చేసుకుంటే సంబంధిత తహసీల్దార్లు రిజిస్ట్రేషన్​, మ్యుటేషన్లను ఒకే రోజు పూర్తి చేస్తున్నారు. నవంబర్​ 2 నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 4 వేల 240 దరఖాస్తులు రాగా.. బుధవారం నాటికి లక్షా 310 రిజస్ట్రేషన్లు, మ్యుటేషన్లను అధికారులు పూర్తి చేశారు. ఒక్కో రిజిస్ట్రేషన్​కు సగటున 54 నిమిషాల టైం తీసుకుంటోంది. అగ్రికల్చర్​ ల్యాండ్స్​ను నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్స్​గా మార్చుకునేందుకు డిసెంబర్​ 16 నుంచి నాలా కన్వర్షన్​ ఆప్షన్​ను ప్రభుత్వం ధరణి పోర్టల్​లో చేర్చింది. నాలా కన్వర్షన్​ కోసం నెల రోజుల్లో 2,951 అప్లికేషన్లు.. 2,672 అప్లికేషన్లు అప్రూవల్ పొందాయి. నాఆల కన్వర్షన్​ అప్రూవల్​కు సగటున 20 నిమిషాలు పడుతోంది.