సరికొత్త గేమ్..నిద్రపోయి ఆడే ఆట

సరికొత్త గేమ్..నిద్రపోయి ఆడే ఆట

టోక్యో: రాత్రయినా, లైట్లు బంజేసినా చేతిల ఫోన్​ పట్టుకుని గేమ్​ ఆడేస్తుంటరు చాలా మంది. దాని​ ధ్యాసలో పడి నిద్ర వదిలేస్తరు. పొద్దుగాల లేవరు. అలాంటి వారి కోసమే ‘పోకెమాన్​’ ఓ సరికొత్త గేమ్​ను తీసుకొస్తోంది. అదే ‘పోకెమాన్​ స్లీప్​గేమ్​’. అంటే నిద్రబోయి ఆడే ఆట అన్నమాట. నిద్రే ఒక ఆట అన్నమాట. 2020లో ఈ గేమ్​ను తీసుకొస్తామని పోకెమాన్​ కంపెనీ బుధవారం ప్రకటించింది. నిద్రనే ఒక ఎంటర్​టైన్​మెంట్​ చేస్తామని చెప్పింది. ‘‘నిద్రను ఎంటర్​టైన్​మెంట్​ చేయడమే మా లక్ష్యం. సరైన టైంలో పడుకోవడం, పొద్దుగాల లేవడమే ఈ గేమ్​” అని కంపెనీ ప్రెసిడెంట్​ సునెకజు ఇషిహర చెప్పారు. ఈ గేమ్​ను డెవలప్​ చేస్తున్న నింటెండో మరికొన్ని వివరాలను చెప్పింది. ఆటగాళ్ల నిద్రను ట్రాక్​ చేయడానికి ఓ పరికరాన్ని తయారు చేస్తున్నామని, అది ప్లేయర్ల నిద్రకు సంబంధించిన వివరాలను వారి వారి స్మార్ట్​ఫోన్​కు పంపుతుందని చెప్పింది. 2016లో పోకెమాన్​ నుంచి వచ్చిన పోకెమాన్​ గో ఆట ఎంత ప్రమాదకరంగా మారిందో తెలిసిందే. ఆటగాళ్ల లైవ్​ లొకేషన్​, కెమెరా, గ్రాఫిక్స్​ అన్నింటిని లైవ్​గా చూపిస్తూ లేని పోకెమాన్​ను ప్రపంచమంతా వెతుకుతూ తిరగడమే ఆ గేమ్​. దాని వల్ల కొందరు బోర్డర్లు దాటిపోయిన సందర్భాలున్నాయి. రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగాయి. ఈ గేమ్​నూ డెవలప్​ చేసిందీ నింటెండోనే. పోకెమాన్​ గో పేరిట ఒక యాప్​నే తీసుకొచ్చింది ఆ సంస్థ. ఇక, ఈ సరికొత్త ‘స్లీప్​ గేమ్​’పై నెటిజన్లు సరదా కామెంట్లు గుప్పిస్తున్నారు. నిద్రపోవడమే ఆటైతే దాని కోసం ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంకో ఆరుగంటలు ఎక్కువ పడుకునేందుకు గేమ్​ తెస్తున్నరులే అంటూ కామెంట్​ చేస్తున్నారు.