ఐఐటీల్లో అడ్మిషన్లకు కొత్త రూల్స్​తో.. తెలుగు స్టూడెంట్లకు అన్యాయం

ఐఐటీల్లో అడ్మిషన్లకు కొత్త రూల్స్​తో.. తెలుగు స్టూడెంట్లకు అన్యాయం
  •  ఎత్తివేయాలని విద్యార్థి, ప్రజా సంఘాల డిమాండ్​

హైదరాబాద్​, వెలుగు: ఐఐటీల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్​డ్​కు 2021–22 సెప్టెంబర్​ 21కి ముందు ఇంటర్​ పరీక్షలు రాసిన విద్యార్థులు అనర్హులని కేంద్రం పేర్కొనడం దారుణమని విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ఆ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు. అన్ని సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులకూ ఇంటర్​లో 75% మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధన పెట్టడమూ అన్యాయమని, ఆ రూల్​నూ ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆదివారం ఏఐఎస్ఎఫ్​, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్​యూ, పీడీఎస్​యూవీ, కుల నిర్మూలన వేదిక నేతలు ఓ ప్రకటనను విడుదల చేశారు.

 ఐఐటీల్లో చదివేందుకు ఏటా పోటీ పడుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని, ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్రం తెచ్చిన ఆ కొత్త నిబంధనలు వారికి అవకాశాలను దూరం చేస్తాయని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల ప్రతిభను చూసి ఓర్చుకోలేకే కేంద్రం ఇలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వ్యతిరేక విధానాలను తెస్తున్నదని విమర్శించారు. 

ఉత్తర భారత విద్యార్థులకు అనుకూలంగానే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. ఐఐటీ, ఎన్​ఐటీ, ట్రిపుల్​ఐటీల్లో వేలల్లో ఉన్న ఫీజులను లక్షలకు పెంచి.. దక్షిణాదికి చెందిన విద్యార్థులు చేరకుండా చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా పెట్టిన ఆ నిబంధనలను ఎత్తేసేలా కేంద్రంపై తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది ఎంపీలు ఒత్తిడి తేవాలని డిమాండ్​ చేశారు.