ఒమిక్రాన్ టెన్షన్: ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు

ఒమిక్రాన్ టెన్షన్: ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రమవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు కట్టుదిట్టం చేసింది. ఒమిక్రాన్ ముప్పు తీవ్రంగా ఉన్న ఎట్ రిస్క్ దేశాల సంఖ్యను పెంచుతూ ప్రకటన చేయడంతో పాటు ఆ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఎనిమిదో రోజు కరోనా టెస్టు చేయించుకోవాలని, నెగెటివ్ వస్తేనే క్వారంటైన్ ముగించాలని సూచించారు. ఈ నెల 11 నుంచి కొత్త గైడ్‌లైన్స్ అమలులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు

ఒమిక్రాన్ ముప్పు తీవ్రంగా ఉన్న దేశాల సంఖ్య గతంలో పది మాత్రమే ఉండగా.. దానిని ఇప్పుడు భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. యూకే సహా అన్ని యూరోప్ దేశాలను ఎట్ రిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. అలాగే దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్‌వానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజఖ్‌స్థాన్, కెన్యా, నైజీరియా, టునీషియా, జాంబియా దేశాలను ఎట్ రిస్క్ దేశాలుగా పేర్కొంది కేంద్రం. 

నెగెటివ్ వచ్చినా సరే 7 రోజుల క్వారంటైన్

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 72 గంటలలోపు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉండాలని, అలాగే 14 రోజుల ముందు ట్రావెల్ హిస్టరీతో పాటు పూర్తి వివరాలను ముందుగా ఆన్‌లైన్ ఎయిర్ సువిధ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఒక వేళ పోర్టల్‌లో ఇచ్చిన వివరాలు తప్పని తేలితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పింది. భారత్‌లో దిగిన తర్వాత కరోనా టెస్టు కోసం కూడా సువిధ పోర్టల్‌లోనే నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఎట్ రిస్క్ వచ్చిన దేశాల నుంచి వచ్చిన వారికి నెగెటివ్ వచ్చినా సరే 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని, ఎనిమిదో రోజు మరోసారి టెస్టు చేయించుకుని ఆ రిపోర్ట్‌ను సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. ఆయా దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వస్తే అడ్మిట్ అయ్యి.. శాంపిల్స్‌ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని పేర్కొంది కేంద్రం. అలాగే నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా నెగెటివ్ వచ్చినా 7 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి అని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్.. రూపొందించిన టాటా

టైగర్ ఉండు.. టీఆర్‌‌ఎస్‌ను గద్దె దించుతం