కరోనా టైమ్‌లోనూ కొత్త స్కూళ్లు

కరోనా టైమ్‌లోనూ కొత్త స్కూళ్లు
  • వచ్చే ఏడాది స్టార్ట్ చేసేందుకు 362 దరఖాస్తులు
  • ఎక్కువ భాగం క్లోజ్ అయ్యాక కొన్నవే కొత్త పేర్లతో..
  • ప్రైమరీ నుంచి అప్‌గ్రేడేషన్‌కు మరో 99 దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా టైమ్లోనూ కొత్త స్కూళ్లు తెరుస్తామంటూ విద్యా శాఖ పర్మిషన్ కోరుతూ అప్లికేషన్లు వచ్చాయి. కరోనా కారణంగా స్కూళ్లు నడవక ఒకపక్క స్కూళ్లు మూతపడుతున్న తరుణంలో దాదాపుగా అంతే స్థాయిలో కొత్త స్కూళ్లు రానుండడం గమనార్హం. వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు, అప్గ్రేడ్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఏకంగా 461 అప్లికేషన్లు విద్యా శాఖకు అందాయి. అయితే వీటిలో కొత్తగా ఏర్పాటవుతున్న స్కూళ్లు చాలా తక్కువేనని, కరోనా కారణంగా మూతపడి, అమ్మకానికి పోయినవే కొనుగోలు చేసి మరో పేరుతో స్టార్ట్ చేసేందుకు కొత్త యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నవే ఎక్కువని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
గతం కన్నా అప్లికేషన్లు డబుల్
రాష్ట్రంలో 2021–-22 అకాడమిక్ ఇయర్లో బడులు స్టార్ట్ చేసేందుకు గడిచిన డిసెంబర్ వరకూ ఆన్లైన్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దరఖాస్తులు తీసుకున్నది. ఇందులో భాగంగా కొత్త స్కూళ్లు స్టార్ట్ చేసేందుకు 362 అప్లికేషన్లు రాగా, ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి, హైస్కూల్కు అప్గ్రేడ్ చేసుకునేందుకు మరో 99 దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తంగా 461 అప్లికేషన్లు వచ్చాయి. ముందటేడాదితో పోలిస్తే ఈ సంఖ్య డబుల్ అయింది. వరంగల్ ఆర్జేడీ పరిధిలోనే ఎక్కువ అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాల వారీగా వచ్చిన అప్లికేషన్లను డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు వెరిఫై చేసి, డీఈవోలకు నివేదించాల్సి ఉంటుంది. ఏడో తరగతి వరకూ డీఈవోలు, 8, 9 తరగతులు ఆర్జేడీలు పర్మిషన్ ఇస్తారు. టెన్త్ క్లాసు అయితే తప్పనిసరిగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టెన్త్ క్లాస్ కోసం70 వరకు అప్లికేషన్లు వచ్చాయి. కొత్తగా వచ్చిన అప్లికేషన్లలో ఓ కార్పొరేట్ సంస్థకు చెందిన దరఖాస్తులే 50 వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఉన్నవాటి పేర్లు మార్చొద్దన్న ఆదేశాలతో ‘కొత్తగా’..
తెలంగాణలో ప్రస్తుతం 10,461 ప్రైవేటు స్కూళ్లున్నాయి. 2020–21 అకాడమిక్ ఇయర్ కోవిడ్ ఎఫెక్ట్తో ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేవలం నెలన్నర మాత్రమే ఫిజికల్ క్లాసులు జరిగాయి. దీంతో బడ్జెట్ స్కూళ్ల నిర్వహణ కష్టంగా మారి, వందల సంఖ్యలో మూతపడ్డాయి. కొన్నిచోట్ల యాజమాన్యాలు అమ్మకానికి పెట్టగా, మరికొన్ని చోట్ల కొన్ని కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు బలవంతంగానైనా కొని పేర్లు మార్చుకునే ప్రయత్నాలు చేశాయి. దీనిపై బడ్జెట్ స్కూళ్ల యాజమాన్యాల సంఘాలు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఉన్న స్కూళ్లకు నేరుగా పేర్లు మార్చొద్దని విద్యా శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మూతపడిన వాటిని కొనుగోలు చేసిన మేనేజ్మెంట్లు ఉన్నవాటి బోర్డులు పీకేసి, కొత్తగా స్కూళ్లు పెడుతున్నట్లుగా దరఖాస్తులు చేసుకున్నాయి.