ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్, ఓవర్బ్రిడ్జిల పనులను 2026 ఏప్రిల్‌నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి రైల్వే, ఆర్అండ్బీ, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలోని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న పనుల భూసేకరణ, సాంకేతిక అనుమతులు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు. ఆగిపోయిన పనులను డిసెంబర్‌లో ప్రారంభించి 2026 ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలన్నారు. మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలతో రైల్వే అధికారులు సమన్వయం పనిచేసి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. సమావేశంలో రైల్వే సీనియర్ ఇంజనీర్ సాంబశివరావు, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ రాజు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
