టీటీడీ కీలక నిర్ణయం: శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లకు నూత‌న సాఫ్ట్‌వేర్

టీటీడీ కీలక నిర్ణయం: శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లకు నూత‌న సాఫ్ట్‌వేర్

తిరుమల: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనానికి వచ్చే భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు, ట్రైనర్స్‌తో నిరంత‌ర‌ శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందుకోసం నూత‌న సాఫ్ట్‌వేర్ రూపొందించిన‌ట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్‌నాయుడు చెప్పారు. అదేవిధంగా తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శకంగా బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయించిన‌ట్లు ఆయన తెలిపారు. తిరుమ‌ల అన్నమ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం (సెప్టెంబర్ 3) ఛైర్మన్, ఈవో జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి, సీవీఎస్వో ముర‌ళికృష్ణతో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వహించారు. 

ఈ సంద‌ర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సూచనల మేరకు టీటీడీలోని శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు. శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవను 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా తిరుమలలో ప్రారంభించార‌న్నారు. 

శ్రీవారి సేవ ప్రారంభించి ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి కావస్తోంద‌ని, ఈ 25 సంవత్సరాలలో తిరుమల, తిరుపతిలలో దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొన్నట్లు చెప్పారు. శ్రీవారి సేవకులకు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామ‌న్నారు. రోజుకు దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాలలో తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. 

అనంత‌రం ఈవో జె.శ్యామ‌ల‌రావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేర‌కు భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం, తిరుమ‌ల ప‌విత్ర కాపాడటంలో భాగంగా గ‌త 14 నెల‌లుగా టీటీడీలో అనేక సంస్కర‌ణ‌లు చేప‌ట్టింద‌ని అన్నారు. ఇందులో భాగంగా క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, క‌ల్యాణ‌క‌ట్ట, ల‌గేజి కౌంట‌ర్లు, అన్నప్రసాదాలు, శ్రీ‌వారి సేవ‌కుల‌తో నిరంత‌రాయంగా అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

ల‌డ్డూ, అన్నప్రసాదాల నాణ్యత‌, రుచిపై భ‌క్తుల నుండి ప్రశంస‌లు అందుతున్నద‌న్నారు. శ్రీవారి సేవకుల ట్రైనర్స్‌కు ఐఐటి అహ్మదాబాద్ ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింద‌న్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా శ్రీవారి వైభవం, తిరుమల ప్రాముఖ్యత, భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలు, సేవాతత్వం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

గ్రూప్ సూపర్ వైజర్స్

ఈ విభాగంలో 45-65 సంవత్సరాల వయసు ఉన్న వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తిరుమలలోని వివిధ విభాగాలలో సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి  గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులు మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. వీరి సేవా కాల పరిమితి 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు, విద్యార్హత: కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

ప్రొఫెషనల్ సేవ  

సీఎం చంద్రబాబు సూచనల మేరకు టీటీడీలోని స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద, చిన్న పిల్లల ఆసుపత్రి, అశ్వినీ ఆసుపత్రులలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

ఎన్.ఆర్.ఐ సేవ

విదేశాలలో ఉన్న ఎందరో ఎన్.ఆర్.ఐ నిపుణులు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వివిధ వృత్తులలో ప్రావీణ్యం కల్గిన నిపుణులకు శ్రీవారి  సేవకు అవకాశం కల్పిస్తున్నాం.