
బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. ఈ సినిమా నుండి ‘పోతుగడ్డ మీద.. భూమి బిడ్డలారా’ అంటూ సాగే పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో బాబీ సింహా మాట్లాడుతూ ‘భీమ్స్ సంగీతం, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యంలో తెలియని ఎమోషన్ ఉంది. సినిమా షూటింగ్ సమయంలోనూ మేం అంతే రేంజ్‌లో ఎమోషనల్‌గా ఉన్నాం. తెలంగాణ హిస్టరీ తెలుసుకుని ఆశ్చర్యపోయాను’ అని చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఈ పాట ఉంటుంది.
పూర్వీకులను గుర్తు చేసుకుంటూ మేము ఇచ్చిన నివాళి ఇది’ అని చెప్పాడు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించారని సుద్దాల అశోక్ తేజ చెప్పారు. భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. తెలంగాణ సమాజం ఎంత దు:ఖానికి గురయ్యిందో.. ఎన్ని కన్నీళ్లను చూసిందో.. ఆ తల్లులందరి స్వరాలకు నేను స్వరం సమకూర్చినట్టు ఉంది. అలాగే అమరులైన వీరుల గొంతుకను కలిపి ఈ పాటను పాడా. ఈ సినిమాకు పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా’ అని చెప్పాడు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.