సీబీఐ టీం మొత్తాన్ని మార్చేశారు.. వివేక హత్య కేసులో సంచలన నిర్ణయం

సీబీఐ టీం మొత్తాన్ని మార్చేశారు.. వివేక హత్య కేసులో సంచలన నిర్ణయం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన నిర్ణయం జరిగింది. ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందం మొత్తాన్ని మార్చేసింది సీబీఐ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మార్చి 29వ తేదీ బుధవారం ప్రకటించింది ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్. ప్రస్తుతం ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న  రాంసింగ్ ను తప్పించి.. ఆయన స్థానంలో సీబీఐ డీఐజీ చౌరాసియాను నియమించారు ఉన్నతాధికారులు. 

కొత్త టీంలో సభ్యులుగా ఎస్పీ వికాశ్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్ స్పెక్టర్లుగా ఎస్.శ్రీమతి, పునియా, ఎస్ఐ అంకిత్ యాదవ్ లతో ఆరుగురు సభ్యులతో టీం ఏర్పాటు చేశారు. ఇక నుంచి వీరి ఆధ్వర్యంలోనే హత్య కేసు విచారణ కొనసాగనుంది. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించటంతో.. కొత్త టీం వెంటనే బాధ్యతల స్వీకరణ చేయనుంది. నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. ప్రతిరోజూ విచారణ చేయాలని నిర్ణయించింది కొత్త విచారణ బృందం. 

ఇప్పటి వరకు కేసు విచారణ అధికారిగా ఉన్న రాంసింగ్ ను మార్చాలంటూ కేసులోని నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. విచారణ బృందాన్ని తప్పించాలని ఆదేశిస్తూ.. దర్యాప్తు జరుగుతున్న తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడేళ్లుగా విచారణ సాగుతున్నా.. ఎలాంటి పురోగతి లేనప్పుడు రాంసింగ్ ఉండి ఉపయోగం ఏంటని అత్యున్నత న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. ఈ క్రమంలోనే  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను చౌరాసియా ఆధ్వర్యంలోని కొత్త టీంకు అప్పగించారు సీబీఐ ఉన్నతాధికారులు.