కొత్త ట్రెండ్: పండ్లు, కూరగాయలకు మాల్స్

కొత్త ట్రెండ్: పండ్లు, కూరగాయలకు మాల్స్

కరోనా ఎఫెక్ట్‌‌తో బిజినెస్​లో నయా ట్రెండ్

… ఇవేకాదు హైదరాబాద్​లో అనేక ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లకు కార్పొరేట్​ స్టయిల్​లో ఇట్ల సెపరేట్​ షాపులు వెలుస్తున్నాయి. రెండు మూడు నెలలుగా ఎక్కడ చూసినా వెజిటబుల్​ మాల్స్  ట్రెండ్‌ కనిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా గల్లీ మార్కెట్లలో కనిపించిన కూరగాయలు, పండ్లు ఇప్పుడు అద్దాల మేడల్లో మెరిసిపోతున్నాయి. కరోనాతో వచ్చిన మార్పులకు తగ్గట్టు వ్యాపారులు బిజినెస్​ రూట్​ను మార్చుకుంటున్నారు.

అచ్చం షోరూంల లెక్కనే..

సాధారణంగా బడా మాల్స్‌, ఎలక్ట్రానిక్‌ షోరూంలు వేలాది చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటాయి. తాజాగా వెలుస్తున్న వెజిటబుల్‌, ఫ్రూట్​ స్టోర్లు కూడా విశాలమైన స్థలంలో ఉంటున్నాయి. కనీసం 15 వందల చదరపు అడుగుల నుంచి పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్లు ఏర్పాటవుతున్నాయి. అన్నిరకాల తాజా కూరగాయలు, తాజా పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్లుగా ఉపయోగపడే ఆహార పదార్థాలు, వాటి తయారీకి ఉపయోగించే వస్తువులన్నీ స్టోర్ల నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. జనం కూడా బట్టలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకన్నా ఫుడ్‌ ఐటమ్స్‌ కొనుగోలుకే ఎక్కువ ఆసక్తి చూపడంతో వీళ్ల వ్యాపారం కూడా మంచిగా నడుస్తోంది.

కమర్షియల్‌‌ సెంటర్లలో వెలుస్తున్న వెజిటబుల్​ షాపులు

హైదరాబాద్​లో లాక్‌‌డౌన్‌‌కు ముందు రెండే పొలిమేరాస్‌‌..

ఇపుడు యాభై 25వ స్టోర్‌‌ ప్రారంభించిన  ప్యూర్‌‌ ఓ నేచురల్స్‌‌

పెద్ద పెద్ద కంపెనీలదీ ఇదే దారి..

4 స్టోర్లు ఏర్పాటు చేసిన  బజాజ్.. త్వరలో మరో 40​

వందో బ్రాంచ్​ పెట్టిన రత్నదీప్‌‌

40 పర్సెంట్‌‌ బ్రాంచ్​లు పెంచుతున్న రిలయన్స్‌‌

ఆదరిస్తున్న జనం.. మస్తు బిజినెస్​

హైదరాబాద్‌, వెలుగు: కరోనా వల్ల జనం హెల్త్​కు ఎక్కువగా ప్రిఫరెన్స్​ ఇవ్వడంతో తాజా పండ్లు, తాజా కూరగాయలకు డిమాండ్​ పెరిగింది. లాక్‌డౌన్‌ తర్వాత గ్రోసరీ బిజినెస్‌కు మంచి గిరాకీ ఉంటుందని గతంలో మెకిన్సే లాంటి అంతర్జాతీయ సర్వే సంస్థలు కూడా చెప్పాయి. దీన్ని అనుసరించో.. లేక పరిస్థితులకు అనుగుణంగానో.. చాలా మంది వ్యాపారులు తమ బిజినెస్​ తీరును మార్చుకున్నారు. కూరగాయలు, పండ్ల వ్యాపారాల్లో దిగారు. కొత్తవాళ్లు కూడా ఇదే వ్యాపారం బెటర్​ అని ముందుకు వస్తున్నారు. ఆర్గానిక్‌ వెజిటబుల్స్‌ అమ్మే ‘పొలిమేరాస్‌’కు లాక్‌డౌన్‌కు ముందు సిటీలో రెండు, మూడు సెంటర్లు మాత్రమే ఉండేవి. కరోనా కారణంగా ఏర్పడ్డ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్‌ తర్వాత తమ సెంటర్లను 50కి పెంచామని, మరో 25 స్టోర్లను ఓపెన్‌ చేయాలనే ఆలోచన ఉన్నట్లు పొలిమేరాస్​కు చెందిన ఓ స్టోర్‌ మేనేజర్‌  చెప్పారు. లాక్‌‌డౌన్‌‌ కన్నా ముందు ‘ప్యూర్‌‌ ఓ నేచురల్స్‌‌’ బ్రాంచ్​లు 15 ఉంటే తర్వాత ఏర్పడ్డ డిమాండ్‌‌ చూసి వాటి సంఖ్యను మరో 10కి పెంచారు. బంజారాహిల్స్‌‌లో ఇటీవలే 25వ స్టోర్‌‌ను ఏర్పాటు చేసి సిటీలో మరిన్ని బ్రాంచ్​లు ఓపెన్‌‌ చేసేందుకు సెంటర్లను వెతికే పనిలో ఆ కంపెనీ ఉంది.

పెద్ద కంపెనీలు కూడా స్టోర్లు పెంచుతున్నయ్​

పెద్ద కంపెనీలు కూడా తమ వెజిటబుల్​, గ్రోసరీ స్టోర్లను పెంచుతున్నాయి. హైదరాబాద్​లో దాదాపు 45 రిలయన్స్‌‌ ఫ్రెష్‌‌ సూపర్‌‌ మార్కెట్లున్నాయి. వీటికి అదనంగా మరో 40 శాతం స్టోర్లు పెంచాలని ఆ కంపెనీ ప్లాన్‌‌ చేసింది. ‘‘లాక్‌‌డౌన్‌‌ తర్వాత నిత్యావసరాల కొనుగోళ్లు పెరిగాయి. దాంతో మేం ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ పెంచాం. కొత్తగా మరో 12 స్మాల్‌‌ పాయింట్స్‌‌ ఏర్పాటు చేశాం’’ అని రిలయన్స్‌‌ స్టోర్స్‌‌ మేనేజర్‌‌ రవి చెప్పారు. ఎలక్ట్రానిక్‌‌ గూడ్స్‌‌ బిజినెస్‌‌లో ఫేమస్‌‌ అయిన బజాజ్‌‌ కూడా గ్రోసరీస్‌‌ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సిటీలో నాలుగు స్టోర్లు ఏర్పాటు చేసింది. త్వరలో 40 బ్రాంచ్​లకు బిజినెస్‌‌ ఎక్స్‌‌పాండ్‌‌ చేయాలని అనుకుంటున్నట్లు బజాజ్‌‌ ఎండీ పీయూష్‌‌  అన్నారు. సిటీలోని కాస్టిలీ కమర్షియల్‌‌ ఏరియా అయిన బంజారాహిల్స్​ రోడ్‌‌ నెం. 12లో కొద్ది రోజుల కిందే ‘బజాజ్‌‌ మార్ట్‌‌’ స్టార్టయింది. గతంలో 65 బ్రాంచ్​లున్న ‘రత్నదీప్‌‌’.. లాక్‌‌డౌన్‌‌లో కొత్తగా 15 బ్రాంచ్​లు ఏర్పాటు చేసి ఇటీవలే వందో బ్రాంచ్​ని తెరిచింది. సిటీలో 73 బ్రాంచ్​లున్న హెరిటేజ్‌‌ కూడా విస్తరణ ప్లాన్‌‌లో ఉంది. లోకల్‌‌ బ్రాండ్లుగా కనిపించే బాలాజీ, ఘన్‌‌శ్యామ్‌‌ సూపర్‌‌ మార్కెట్లు సిటీ 10కి పైగా బ్రాంచ్​లతో వ్యాపారం నడిపేవి. ఇప్పుడు అవి కూడా బ్రాంచ్​ల సంఖ్యను 15 నుంచి 20కి పెంచాయి.

రెస్టారెంట్లు, క్లాత్​ స్టోర్స్​ మూసేసి..

రెస్టారెంట్లు, క్లాత్‌ స్టోర్స్‌, ఇతర బిజినెస్‌‌లు నడుపుతున్న వాళ్లు వాటిని మూసేసి కొత్త బ్రాండ్లతో స్టోర్లు ఏర్పాటు చేస్తున్నారు. బిజినెస్‌‌ బాగా నడిస్తే వాటిని విస్తరిస్తున్నారు.నేరెడ్​మెట్‌‌ చౌరస్తాలో ఒక ఫర్నీచర్‌‌ షాపు స్థానంలో ‘బయ్‌‌ తాజా’ అనే పేరుతో కూరగాయలు, ఫ్రూట్స్‌‌ స్టోర్‌‌ వెలిసింది. ఒక బేకరీ స్థానంలో ‘ఫామ్‌‌ 2 హోం’ అనే పేరుతో స్టోర్‌‌ పెట్టారు. సింప్లీ ఫ్రెష్‌‌ ఆర్గానిక్‌‌, ఫామ్ బ్లిస్, తాజా వెజ్జీ, హెల్దీ స్టోర్స్‌‌ ఇలా రకరకాల పేర్లతో వెలుస్తున్నాయి. హైదరాబాద్​లోని బంజారాహిల్స్, బేగంపేట్, అమీర్ పేట్, మధురానగర్, సికింద్రాబాద్, కోఠీ వంటి పలు ప్రాంతాల్లో క్లాత్ స్టోర్స్ విపరీతంగా ఉంటాయి. లాక్ డౌన్ లో మెయింటెనెన్స్ భారంతో టెక్స్ టైల్స్, ఇతరత్రా బిజినెస్ లను క్లోజ్ చేశారు. దీంతో సిటీలోని చాలాచోట్ల స్టోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి. బ్రాండెడ్ లేఅవుట్ బ్రాంచ్​లు కూడా మూతబడ్డాయి. ఇప్పుడు వాటి ప్లేస్ లో ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, సూపర్ మార్కెట్లు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి.

ఎక్స్​పాండ్ చేశాం

మేం సూపర్‌‌ మార్కెట్‌‌ బిజినెస్‌‌లోకి దిగి కొన్నేండ్లే అయింది. లాక్‌‌డౌన్‌‌లో స్టోర్స్‌‌లో బాగా రష్‌‌ ఉండేది. అప్పట్లో టైమింగ్‌‌ రిస్ట్రిక్షన్‌‌, క్రౌడ్‌‌ లిమిటేషన్‌‌ వల్ల కొందరినే స్టోర్‌‌లోకి పంపేవాళ్లం. చాలా మంది వెయిట్​ చేసే వాళ్లు. కొందరు ఓపిక లేక వేరే స్టోర్లకు వెళ్లేవాళ్లు. దీంతో మా బిజినెస్‌‌ ఎక్స్‌‌పాండ్‌‌ చేయాలనుకున్నం. ఆరేడు కొత్త బ్రాంచీలు స్టార్ట్‌‌ చేశాం. ఈ మధ్యే బంజారాహిల్స్‌‌లో 25 బ్రాంచీని కూడా స్టార్ట్‌‌ చేశాం. మరికొన్ని ఓపెన్‌‌ చేసే ప్లాన్‌‌లో ఉన్నాం. -చందు, స్టోర్​ మేనేజర్​, ప్యూర్ ఓ నేచురల్ సూపర్ మార్కెట్

లాక్ డౌన్ లో మొదలు

నేను మూవీస్ డైరెక్ట్ చేస్తుంటా. లాక్ డౌన్ లో షూటింగ్స్ ఆగిపోయాయి. నా ఫ్రెండ్, మా పిల్లలు ఇచ్చిన ఐడియాతో ఫామ్ బ్లిస్ కంపెనీ స్టార్ట్ చేశాం. లాక్ డౌన్ తో గ్రోసరీకి, వెజిటబుల్స్ కు ఉన్న డిమాండ్ తోనే ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాం. కొత్తగా ఉండాలని ఈ బిజినెస్​పై  రీసెర్చ్ చేశాం. కూరగాయలు, పప్పులు, నూనె వంటి వాటి సాగు గురించి నేరుగా పొలాలకు వెళ్లి తెలుసుకున్నాం. మేమే స్వయంగా సాగు చేయిస్తూ వాటినే కస్టమర్లకు అందిస్తున్నాం. మేం ఆన్​లైన్ ద్వారా అందుబాటులో ఉన్నాం. -తేజాస్ ధన్ రాజ్