రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథిగా హాజరైన కోలీవుడ్ స్టార్ సూర్య మాట్లాడుతూ ‘రవితేజ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపుగా చూస్తాను. తన గురించి కార్తి, జ్యోతిక తరచుగా చెబుతుంటారు. కామన్ మ్యాన్ నుంచి కింగ్ సైజ్‌గా ఎదిగిన ఆయన లైఫ్ అందరికీ ఆదర్శం. ఆయన వర్క్‌కు నేను ఫ్యాన్‌ని. రవితేజ గారి టైమింగ్ చాలా బాగుంటుంది. అలాంటి టైమింగ్ కొంతమందికే ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ జాతర చూస్తారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.
రవితేజ మాట్లాడుతూ ‘ఈసారి జాతర మామూలుగా ఉండదు. ఈ సినిమా అందరి అంచనాలను అందుకుంటుంది. నవీన్ చంద్రలోని కొత్త కోణం ఇందులో చూస్తారు. శివుడు పాత్రలో చాలా బాగా నటించాడు. రాజేంద్ర ప్రసాద్ గారితో వచ్చే కాంబినేషన్, వచ్చే సీన్స్ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తాయి. శ్రీలీలది నాది సూపర్ హిట్ కాంబినేషన్ అని మరోసారి ప్రూవ్ అవుతుంది. ఈ సినిమా కోసం టెక్నికల్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా భీమ్స్ నాకు ఇంకొక చార్ట్ బస్టర్ ఇస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడు భాను నెక్స్ట్ లెవల్‌కి వెళ్తాడు’ అని అన్నారు.
శ్రీలీల మాట్లాడుతూ ‘రవితేజ గారితో ‘ధమాకా’ తర్వాత మరోసారి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనలోని ఎనర్జీని అందరికీ ఇస్తారు. ఇందులో రవితేజ గారిని ఏక వచనంతో పిలిచే క్యారెక్టర్ నాది. దానికి సెట్‌లో చాలా ఫీలయ్యా. మాసివ్ పాత్రలో కనిపిస్తా. రాజేంద్ర ప్రసాద్ గారితో కాంబినేషన్ సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పింది.
శివుడు పాత్రలో ఇంటెన్స్‌గా కనిపిస్తానని నవీన్ చంద్ర చెప్పాడు. చాలాకాలం తర్వాత అద్భుతమైన మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రమిది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ ‘నా కథను నమ్మి ఎంకరేజ్ చేసిన రవితేజ గారికి థ్యాంక్స్. ఆయనకు ఫ్యాన్ బాయ్‌గా ఈ సినిమాను రూపొందించా. శ్రీలీలలోని మాస్ యాంగిల్‌ను ఇందులో చూస్తారు. రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. టెక్నికల్ టీమ్ అంతా బాగా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ నాగవంశీ గారిలాంటి పెద్ద క్రిటిక్ ఎవరు ఉండరు. ఆయన సినిమా చూసి బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది’ అని చెప్పాడు. రవితేజ గారి సినిమాల నుంచి ఏదైతే ఆశిస్తారో అవన్నీ ఇందులో ఉంటాయని నిర్మాత నాగవంశీ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. తాను, తన కుటుంబం ఇవాళ బతికి ఉండటానికి కారణం రవితేజ సర్ అని చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘నా జర్నీకి సపోర్ట్‌గా ఉంటూ అండగా నిలిచిన వ్యక్తి రవితేజ గారు. నేను ధమాకా చేసినప్పటి నుంచి చిరంజీవి సర్ సినిమా చేసే వరకు ప్రతి పాట వెనుక, ప్రతి ప్రోత్సాహం వెనుక ఓ వ్యక్తి ఉన్నారు. నేను ఓ పాట పాడుతూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటున్న సమయంలో నా భార్యా పిల్లలకు అది ఎందుకు తీస్తున్నానో తెలియదు. అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి.. పిల్లలను ఎలా చదివించాలి అని బాధపడుతున్నాను. అప్పుడే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది.
నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి.. ఇక నేను, నా భార్యాపిల్లలతో కట్టగట్టుకొని పైకి వెళ్లిపోదామనుకున్నాను. అలాంటి సమయంలో ఓ దేవుడిలాగా, ఓ జీసస్ లాగా, ఓ అల్లాలాగా, రాముడిగా, తిరుపతి వెంకన్న నా జీవితంలో ఓ వ్యక్తి వచ్చారు. నన్ను ఆదుకున్న దేవుడు.. నా కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ సర్. ఇవాళ నేను సజీవంగా ఉండటానికి కారణం.. అమ్మా, నాన్నా తెలుసుకోండి.. ఆ వ్యక్తి రవితేజ సర్ ” అని భీమ్స్ సీసిరోలియో అనడంతో ఆడిటోరియం అంతా మార్మోగిపోయింది.’ ఆయనపై నా ప్రేమను సంగీతం రూపంలోనే చూపిస్తాను. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెబుతూ భీమ్స్ తన స్పీచ్ ముగించారు. ప్రస్తుతం భీమ్స్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటీనటులు, టెక్నీషియన్స్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇకపోతే.. భీమ్స్ తనదైన మట్టి గుండెతో స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ క్రమంలో బలగం మూవీతో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు, డెకాయిట్ లాంటి మూవీస్తో మంచు దూకుడు మీద ఉన్నారు.
