10 వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు

10 వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు
  • 10 వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు
  • రిక్రూట్​మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ 
  • నేటి నుంచి వచ్చే నెల12 వరకు దరఖాస్తులు 
  • త్వరలోనే సెర్చ్ కమిటీల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు యూనివర్సిటీల వీసీల నియామకంపై దృష్టిపెట్టింది. ఆయా వర్సి టీల్లో వీసీల గడువు మే నెలలో ముగియనుంది. ఆ లోపే కొత్త వారిని నియమించేందుకు కసరత్తు ప్రారం భించింది. ఈ మేరకు విద్యాశాఖ పరిధిలోని పది వర్సిటీల్లో వీసీల రిక్రూట్​మెంట్​కు విద్యాశాఖ సెక్ర టరీ బుర్రా వెంకటేశం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (హైదరాబాద్), జవహార్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూహెచ్), కాకతీయ యూనివర్సిటీ(వరం గల్), మహాత్మాగాంధీ యూనివర్సిటీ(నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్), పాలమూరు వర్సిటీ(మహబూబ్​నగర్), జవహార్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ​అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్​ఏఎఫ్ ఏయూ–హైదరాబాద్)ల్లో వీసీ పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం నుంచి ఫిబ్రవరి12 సాయంత్రం 5గంటల వరకు రిజిస్టర్ పోస్ట్​ ద్వారా ‘‘ప్రిన్సిపల్ సెక్రటరీ టూ గవర్నమెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, రూమ్ నెంబర్ 7 ఫస్ట్ ఫోర్, తెలంగాణ సెక్రటేరియెట్, హైదరాబాద్–500022” అడ్రస్​కు అప్లికేషన్లు పంపించాలని కోరారు. వీసీ పోస్టులకు క్వాలిఫికేషన్లు, దరఖాస్తు ప్రక్రియ కోసం  www.tsche.ac.in వెబ్ సైట్​చూడాలని సూచించారు. 

రెండు వర్సిటీలు పెండింగ్..

విద్యాశాఖ పరిధిలో మొత్తం12 వర్సిటీలు ఉండగా, వీటిలో ఆర్జీయూకేటీ(బాసర ట్రిపుల్ ఐటీ), తెలంగాణ మహిళా యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. అయినా విద్యాశాఖ ఇచ్చిన నోటిఫికేషన్​లో మాత్రం ఆ రెండింటి పేర్లు పేర్కొనలేదు. ఇతర వర్సిటీలతో పోలిస్తే ఆర్జీయూకేటీ చట్టం భిన్నంగా ఉంటుంది. చాన్సలర్ ​గవర్నర్ కాకుండా విద్యావేత్త/ ఇండ్రస్టియలిస్ట్ తదితరులను నియమించాల్సి ఉంది. చాన్స్​లర్ ను నియమించిన తర్వాతే వీసీని రిక్రూట్ చేయాల్సి ఉంది. గత సర్కారు ఈ చట్టం మార్చగా.. న్యాయపరమైన చిక్కులు రావడంతో ఆపేసింది. దీంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. 

కాంగ్రెస్ సర్కారు.. ఆ వర్సిటీ చాన్స్​లర్, వీసీ పోస్టులను భర్తీ చేసేందుకు న్యాయపరమైన సలహాలు తీసుకుంటుంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. అలాగే తెలంగాణ మహిళా  వర్సిటీని ప్రకటించిన గత సర్కారు.. ఇప్పటికీ కనీసం చట్టం కూడా చేయలేదు. దీంతో చట్టం చేసిన తర్వాతే వీసీని నియమించే అవకాశం ఉంది. 

త్వరలోనే సెర్చ్ కమిటీలు..

వర్సిటీల్లో వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు నియమించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. ఒక్కో వర్సిటీకి ముగ్గురిని సెర్చ్ కమిటీలో నియమించనున్నది. దీంట్లో ఒకరు సర్కారు నామినిగా, మరొకరు యూజీసీ నామినిగా, ఇంకొకరు వర్సిటీ నామినిగా ఉంటారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఒక్కో వర్సిటీకి 3 పేర్లను సెర్చ్​కమిటీ సర్కారుకు ప్రతిపాదించనుంది. వాటిని గవర్నర్​కు పంపించి, వీసీలను ఎంపిక చేస్తారు.

 ఇప్పటికే యూజీసీకి నామినీ పేర్లను ప్రతిపాదించాలని విద్యాశాఖ లేఖ రాసింది. ఆ పేర్లు రాగానే, సెర్చ్ కమిటీలు వేయనున్నది. అయితే, ప్రక్రి య పూర్తయి, పేర్లు ప్రకటిస్తే.. అప్పటికీ ఇంకా పాత వీసీల కాలపరిమితి ముగియకపోతే ఆయా వర్సిటీలకు ప్రోవీసీలుగా నియమించి, వారినీ వర్సిటీల్లో కొనసాగించే అంశాన్ని సర్కారు పరిశీలిస్తోంది. లేదంటే పాత వారితో రాజీనామా చేయించాలని భావిస్తోంది.