కరోనాను లెక్క చేయని చైనీయులు

కరోనాను లెక్క చేయని చైనీయులు
  • కరోనాను లెక్క చేయని చైనీయులు 
  • రోడ్లపై కొచ్చి సంబురాలు
  • న్యూ ఇయర్​ సందర్భంగా వుహాన్​ వీధుల్లో వేడుకలు
  • కొవిడ్  ఆంక్షలు ఎత్తేయడంతో వేలాదిగా రోడ్లపైకి..
  • త్వరలో మంచి రోజులు వస్తాయన్న జిన్ పింగ్

బీజింగ్/కాన్ బెర్రా: కరోనా కేసులు రోజూ వేలల్లో నమోదవుతున్నా లెక్క చేయకుండా చైనీయులు న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. శనివారం రాత్రి వుహాన్​లో ప్రజలు భారీగా వీధుల్లోకి తరలివెళ్లి సంబురాల్లో మునిగితేలారు. ఆకాశంలో బెలూన్లు ఎగరేస్తూ, కేకలు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి వైరస్‌‌‌‌  వ్యాప్తిని కంట్రోల్​ చేయడానికిచైనా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. మూడేండ్లలో చాలావరకు ప్రజలను ఇండ్లకే పరిమితం చేసింది. బీజింగ్ లోని ఓ అపార్ట్ మెంట్లో అగ్ని ప్రమాదం జరగగా.. కరోనా నిబంధనల కారణంగా వాళ్లను కాపాడడం ఆలస్యమైందని, దీంతో పదిమంది చనిపోయారని స్థానికులు ఆరోపించారు. క్వారంటైన్  ఆంక్షల వల్లే ప్రాణనష్టం ఎక్కువైందని ఆరోపిస్తూ ఆంక్షలను ఎత్తేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసింది. అంతవరకూ ఇండ్లకే పరిమితమైన ప్రజలు.. న్యూ ఇయర్  వేడుకల కోసం శనివారం రాత్రి వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కరోనా భయం ఉన్నా రిస్క్ తీసుకొని న్యూ ఇయర్  వేడుకల్లో పాల్గొన్నానని ఓ మహిళ పేర్కొంది. ఇలా ఉత్సాహంగా గడిపి చాలా కాలం అయిందని, అందువల్లే కొత్త సంవత్సర సెల్రబేషన్స్‌‌‌‌ లో పాల్గొన్నానని ఆమె చెప్పింది. కాగా న్యూ ఇయర్ సందర్భంగా చైనా ప్రజలకు ఆ దేశ ప్రెసిడెంట్ జిన్​పింగ్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని జిన్​పింగ్​ పేర్కొన్నారు.

కరోనా టెస్టు తప్పనిసరి చేస్తూ.. ఆస్ట్రేలియా, కెనడా దేశాల నిర్ణయం

తమ దేశానికి రావాలంటే చైనీయులు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలని ఆస్ట్రేలియా, కెనడా వెల్లడించాయి. ఆ రెండు దేశాలు ఈ మేరకు గైడ్​లైన్స్  విడుదల చేశాయి. కరోనా నెగెటివ్  సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే ఈ నెల 5 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తామని ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ఓ ప్రకటనలో స్పష్టంచేశాయి.

మార్చికల్లా చైనాలో వంద కోట్ల మందికి కరోనా!

చైనాలో పరిస్థితులపై రీసెర్చ్​ చేసిన యూకే కంపెనీ ఎయిర్​ఫినిటి ఇటీవలే ఓ రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టును ఆస్ట్రేలియాకు చెందిన న్యూస్.కామ్.ఏయూ ప్రచురించింది. రిపోర్టులోని వివరాల ప్రకారం.. చైనాలో ప్రస్తుతం రోజూ 9 వేల మంది కరోనాతో చనిపోతున్నారు. ఈ నెల 15 నాటికి చైనాలో రోజూ 37 లక్షల కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా. ఈ నెల 23 కల్లా 5.84 లక్షల మంది వైరస్​తో  ప్రాణాలు కోల్పోవచ్చు. ‘‘కరోనా కేసులు, మరణా లకు సంబంధించి ప్రభుత్వం వాస్తవా లు వెల్లడించడంలేదు. దీంతో కరోనా కేసులు, మృతులపై కచ్చితమైన అంచనాకు రావడం కష్టంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు తమ దేశంలో నమోదయ్యాయని గత వార మే చైనా నేషనల్ హెల్త్  కమిషన్  ప్రకటించింది. వచ్చే మార్చికల్లా వంద కోట్ల మంది చైనీయులకు కరోనా సోకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చైనా జనాభాలో 40 కోట్ల మందికి మందికి కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నాం”  అని న్యూస్.కామ్ పేర్కొంది. జీరో కొవిడ్  ఆంక్షలు ఎత్తే యడంతో ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే ఎన్ని కేసులు నమోదవుతున్నా యో ప్రభుత్వం చెప్పడంలేదు.