ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో థర్టీ ఫస్ట్ కిక్ రూ.25 కోట్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో థర్టీ ఫస్ట్ కిక్ రూ.25 కోట్లు
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ లిక్కర్ సేల్స్  రూ.417.12 కోట్లు 
  • గతేడాదితో పోలిస్తే రూ.91 కోట్లు అదనపు అమ్మకాలు 
  • కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు 
  • 31 సందర్భంగా ఒకే రాత్రి 281 డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ కేసులు
  • ప్రశాంతంగా ముగిసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 

కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యూ ఇయర్ సంబురాలు ఆబ్కారీ శాఖకు కిక్ ఇచ్చాయి. డిసెంబర్ 31 సందర్భంగా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్క రాత్రే రికార్డు స్థాయిలో రూ.25.67 కోట్ల విలువైన లిక్కర్, బీర్లు తాగేశారు. డిసెంబర్ 31న జగిత్యాల జిల్లాలో రూ.8.07 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో రూ.7.27 కోట్లు, కరీంనగర్ జిల్లాలో రూ.7.24 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.3.10 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 

తాగి వాహనాలు నడుపొద్దని ముందు నుంచి హెచ్చరిస్తున్న పోలీసులు.. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 31 రాత్రి 121 డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖకు, కొత్తగా వైన్స్ షాపులు తెరిచినోళ్లకు డిసెంబర్ నెలలో న్యూఇయర్ వేడుకలతోపాటు పంచాయతీ ఎన్నికలు కలిసొచ్చాయి. 2024తో పోలిస్తే 2025 డిసెంబర్ లో రూ.91 కోట్ల మేర అదనపు అమ్మకాలు జరిగాయి. 

రికార్డు స్థాయిలో సేల్స్.. 

ఉమ్మడి జిల్లాలో 2024 డిసెంబర్ లో రూ.325.43 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగితే.. 2025 డిసెంబర్ లో రికార్డు స్థాయిలో రూ.417.12 కోట్లకు చేరాయి. ఇందులో 3,70,943 కేసుల లిక్కర్, 4,46,246 కేసుల బీర్లు ఉన్నాయి. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో రూ.154.40 కోట్లు(1,36,442 కేసుల లిక్కర్, 1,41,661 కేసుల బీర్లు), జగిత్యాల జిల్లాలో రూ.1‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.30 కోట్లు(85,416 కేసుల లిక్కర్, 1,41,641 కేసుల బీర్లు), పెద్దపల్లి జిల్లాలో రూ.94.28 కోట్లు(89,117 కేసుల లిక్కర్, 85,960 కేసుల బీర్లు), రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.67.14 కోట్లు(59,968 కేసుల లిక్కర్, 76,984 కేసుల బీర్లు) అమ్మకాలు జరిగాయి.  

జగిత్యాల జిల్లాలో బీర్లు తెగ తాగేశారు.. 

చలి కాలంలోనూ చల్లటి బీర్లకే జగిత్యాలవాసులు జైకొట్టారు. ఉమ్మడి కరీంనగర్ లోని మిగతా జిల్లాలతో పోలిస్తే జగిత్యాల జిల్లాలో అత్యధికంగా బీర్లు తాగేశారు. డిసెంబర్ 31న 14,641 కేసుల బీర్లు తాగగా, డిసెంబర్ నెల మొత్తం 1,41,641 కేసుల బీర్లు తాగారు. 

31 నైట్‌‌‌‌‌‌‌‌ డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ కేసులు..

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా యాక్సిడెంట్లను నివారించేందుకు డిసెంబర్ 31న రాత్రి 7 గంటల నుంచి జనవరి 1న తెల్లవారుజాము వరకు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు విస్తృతంగా డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో ఒకేరోజు రాత్రి  281 డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. తనిఖీల్లో చిక్కిన వాహనాలను సీజ్ చేశారు. 

​ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులపై భారీగా ఫైన్లు వేశారు. నంబర్ పేట్లు, సరైన ధృవీకరణ పత్రాలు లేని 224 వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు మొత్తం 1267 చలానాలు(కేసులు నమోదు చేసి) వేసి  రూ.6,24,920 ఫైన్లు వేశారు. ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు