ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్

ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్

న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. వాంఖేడే స్టేడియంలో టీమిండియాను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌట్ చేశాడు. దీంతో టెస్టు క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన బౌలర్లలో మూడో ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఇండియా తరపున అనిల్  కుంబ్లే,  ఇంగ్లండ్ తరపున జిమ్ లేక‌ర్‌ ఈ ఘనత సాధించారు. వారి తర్వాత మూడో వ్యక్తిగా అజాజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న సెకండ్ టెస్టులో అజాజ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. స్పిన్ బౌలింగ్ ను చాలా కాన్ఫిడెంట్ గా, ఈజీగా ఆడే.. భారత బ్యాటర్లను అజాజ్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఆజాజ్ ధాటికి ఇండియా బ్యాటర్లు క్యూ కట్టారు. ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 10 వికెట్లు తీసి అరుదైన ఘనత ను సొంతం చేసుకున్నాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో ఐదుకి పైగా వికెట్లు తీయడం అజాజ్ పటేల్‌కి ఇది మూడో సారి. శ్రీలంక పర్యటనలో ఐదు వికెట్లు తీసిన అజాజ్ పటేల్.. ఆ తర్వాత యూఏఈలో పాకిస్తాన్‌పై ఐదు వికెట్లు తీశాడు. తాజాగా భారత పర్యటనలోనూ ఐదు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

అజాజ్ ప‌టేల్‌ పుట్టింది బాంబేలోనే, కానీ ఆడుతోంది మాత్రం న్యూజిలాండ్‌ తరపున. పుట్టిన సొంత ఊళ్లోనే అజాజ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అజాజ్ ఫ్యామిలీ ఆయనకు 8 ఏళ్లు ఉన్నప్పుడు న్యూజిలాండ్‌కు వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డింది. క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో కష్టపడి కివీస్ జట్టులో స్థానం సంపాదించాడు.