ట్రంప్ నేర్పిన విద్యనే..

ట్రంప్ నేర్పిన విద్యనే..

అమెరికా, యూరోప్ దేశాల్లో గత కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పర్యవసానమే న్యూజిలాండ్ దారుణం. సాటి మనుషులను వ్యతిరేకించే పనులు ఎక్కడ జరిగినా సోషల్ మీడియా ప్రభావంతో ఆ సమాచారం అందరికీ చేరుతుంది. మంచి, చెడులను వేరుచేసి చూడలేని వారు వాటిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ఇతర దేశాల నుంచి ఉద్యోగాల కోసం వస్తున్న వారి సంఖ్య పెరగడం వల్ల తమకు కొలువులు దక్కకుండా పోతున్నాయని అమెరికా సహా అనేక యూరోప్ దేశాల్లోని తెల్లజాతి వారు ఓ అభిప్రాయానికి వచ్చారు. అలాగే ఉద్యోగాల కోసం వచ్చిన బయటిదేశాలకు చెందినవారికి తేలికగా సిటిజన్ షిప్ ఇవ్వడం కూడా తెల్లజాతివారిలో అసంతృప్తికి కారణమైంది. ఈ అసంతృప్తే చివరకు అమెరికాలో దాడులకు కారణమవుతోంది.

కొన్నేళ్లుగా బయటి దేశాల నుంచి వచ్చిన వారిపై అమెరికా, యూరోప్ దేశాల్లో కనిపిస్తున్న వ్యతిరేకతే న్యూజిలాండ్ లో 49 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నది. అమెరికన్ –ఇస్లామిక్ రిలేషన్స్ సంస్థ నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహాద్ అవద్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇదే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను పేరు పెట్టి ప్రస్తావించలేదు కానీ, సమాజంలోని ఒక వర్గానికి వ్యతిరేకంగా ఆయన పెంచిన వ్యతిరేకతనే చివరకు న్యూజిలాండ్ లో శుక్రవారం ప్రార్థనలకు వెళ్లిన ముస్లింల ఉసురు తీశాయన్నది ఒక విశ్లేషణ. డొనాల్డ్ ట్రంప్ తో పాటు మరికొంతమంది యూరోప్ దేశాధినేతలు క్రైస్ట్ చర్చ సంఘటనకు బాధ్యులను ఆయన అంటున్నారు.

రాతల్లోనే కనిపిస్తోంది..
మారణకాండకు ముందు బ్రెంటన్ ఫేస్ బుక్ లో విడుదల చేసిన 74 పేజీల డాక్యుమెంట్ నిండా ఒక వర్గం పై వ్యతిరేకత ఉన్న రాతలే ఉన్నాయి. ‘ దిగ్రేట్ రీప్లేస్ మెంట్ ’ పేరుతో ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన ఈ డాక్యు మెంట్ లో ముస్లింలపై ఆశ్చర్యకరమైన రాతలున్నాయి. ఈ రాతల మధ్య అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేసిన కామెంట్లూ ఉన్నాయి. తెల్లవారి ప్రయోజనాల కోసం కృషి చేసే మహానుభావుడని డొనాల్డ్ ట్రంప్ ను కొనియాడాడు బ్రంటెన్.

అటు టెర్రరిజం ఇటు తెల్లజాతి అసంతృప్తి
ప్రపంచ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. ఒకవైపు మతం పేరిట టెర్రరిజం ప్రబలుతుంటే మరో వైపు అభివృద్ధి చెందిన దేశాల్లో తమకు అవకాశాలు తగ్గిపోతున్నాయని తెల్లవారు అసంతృప్తికి గురి కావడం కనిపిస్తోంది . ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం పాటించాల్సిన డొనాల్డ్ ట్రంప్ లాంటి దేశాధినేతలు ఆ విషయాన్ని మరచిపోతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పొట్టకూటి కోసం వచ్చే ఇతర దేశాల నుంచి వచ్చే వారి పట్ల బ్యాలెన్స్ కోల్పోతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీంతో సమాజంలో వివిధ జాతుల మధ్య వ్యతిరేకత పెరుగుతోంది. జాతీయవాదం ముసుగులో యూరోప్ లోని కొంతమంది ప్రెసిడెంట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. సమాజంలో అశాంతి పెరిగేలా చేస్తున్నారు. ఆసియా దేశాల నుంచి అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లిన వారిపై అక్కడి తెల్లవారు కాల్పులు జరిపి పొట్టన పెట్టుకోవడం ఇటీవల ఎక్కువైంది. ఇండియాకు చెందిన అనేక మంది ప్రతిభావంతులను అక్కడి వైట్స్ ఇలాగే ప్రాణాలు తీశారు. సహజంగా అమెరికా అగ్రరాజ్యం కాబట్టి మిగతా దేశాల్లోని అన్ని రంగాలపై ఈ ప్రభావం ఉంటుందన్నారు సామాజిక విశ్లేషకులు. ఈ ప్రభావానికి లోనైన చాలా మంది తమ దేశాల్లో కూడా వలసదారులపై కత్తి కడుతున్నారు. దయాదాక్షిణ్యం లేకుండా ఎడాపెడా కాల్పులు జరుపుతున్నారు. బతకడానికి వచ్చిన వారిని, ప్రార్థనలు చేసుకోవడానికి మసీదులకు వెళ్లిన వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి ఉసురు తీస్తున్నారు. అమెరికాలో సామూహిక హత్యాకాండలు కొత్త కాదు. 2010 నుంచి ఈ దారుణాలు పెరిగాయంటున్నారు ఆడం లాంక్ ఫోర్డ్ అనే ప్రొఫెసర్. అసహనం, ప్రజల మధ్య వ్యతిరేకతను ఎవరైనా సరే రెచ్చగొడితే లాంగ్ రన్ లో వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయన్నదానికి క్రైస్ట్ చర్చ సంఘటన నిలువెత్తు సాక్ష్యం.

లైవ్ స్ట్రీమింగ్ తో ఏం సాధించాలనుకుంటున్నారు?
న్యూజిలాండ్ సంఘటనకు తెగబడ్డ బ్రెంటన్ ఆ దారుణాన్ని హెల్మెట్ కెమేరా ద్వారా 17 నిమిషాల పాటు ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోను ఫేస్ బుక్ వెంటనే తొలగించింది. అయితే అప్పటికే ఈ కాల్పుల వీడియో ఇతర సోషల్ మీడియాల ద్వారా విపరీతంగా సర్క్యులేట్ అయింది. తెల్లవారికి జరుగుతున్న అన్యాయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం తీసుకురావడానికే బ్రంటెన్ ఈ లైవ్ స్ట్రీమింగ్ కు పాల్పడ్డాడన్నది సైకాలజిస్టుల విశ్లేషణ.

ఇస్లామిక్ ఇమ్మిగ్రేషన్ కు వ్యతిరేకత
మసీదులనే ఎందుకు టార్గెట్ చేశాడో బ్రెంటన్ వివరించాడు. ఆన్ లైన్ లో సుమారు 73 పేజీల వివరణను పోస్టు చేశాడు. యూరోపియన్ దేశాల్లోకి ముస్లింల వలస కారణంగా భూమిపుత్రులైన తెల్ల వారి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని బ్రెంటన్ పేర్కొన్నాడు. బయటిదేశాల నుంచి వచ్చిన వారికి తేలికగా సిటి జన్ షిప్ ఇవ్వడం వైట్స్ ప్రయోజనాలను దెబ్బతీయడమేనని అభిప్రాయపడ్డాడు. దీంతో తెల్లవారికి సొంత దేశాల్లోనే ఉద్యోగాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయన్న డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో భవిష్యతులో యూరోపియన్ దేశాలకు ముస్లింల వలసలకు చెక్ పెట్టడానికే మసీదులను టార్గెట్ చేసినట్లు బ్రెంటన్ వెల్లడించాడు.

అతివాదిగా మారిన ప్రపంచ టూరిస్టు
క్రైస్ట్ చర్చ షూటర్ బ్రెంటన్ హారిసన్ బేసికల్ గా ఓ టూరిస్టు. చాలాసార్లు యూరప్, మధ్య ఆసియా దేశాల్లో పర్యటించాడు. ఎవరితోనైనా పది నిమిషాలు మాట్లాడితే అందులో ఐదు నిమిషాలు ట్రావెలింగ్ గురించే ఉంటుంది. ఏ యూరోపియన్ దేశంలో పర్యటించినా అక్కడి తెల్లవారి పరిస్థితి ఆరా తీసేవాడు. ఇతర దేశస్తులు రావడం వల్ల తెల్లవారి ఉద్యోగ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అనేవాడు. బయటిదేశాల నుంచి వచ్చే వారి వల్ల చివరకు తెల్లజాతి ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఒక భావనకు వచ్చాడు. ఈ నేపథ్యంలో వలసదారులతో పాటు యూరోపియన్ దేశాలకు ఎక్కువగా వచ్చే ముస్లింలపై వ్యతిరేకత పెంచుకున్నాడు. ఈ వ్యతిరేకతే చివరకు క్రైస్ట్ చర్చ్ దారుణానికి దారి తీసింది.

మీడియా కవరేజ్ కారణమా?
మంది ఉసురు తీసే సామూహిక హత్యాకాండలు పెరగడానికి మీడియా కూడా పరోక్షంగా కారణమవుతోందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ 2016 లో సమర్పించిన పరిశోధనా పత్రంలో పేర్కొంది. ఇలాంటి దారుణాలకు మీడియా కవరేజ్ ఎక్కువగా ఉండటంతో ఉన్మాదులు రెచ్చి పోతున్నారన్నది ఈ రీసెర్చ్ పేపర్లలోని సారాంశం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాం టి సంఘటనలు మరీ ఎక్కు వయ్యాయి. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌వంటివి ఇలాంటి హింసాత్మకమైన ఘటనల్ని, అందుకు ప్రోత్సహించేవాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తామని చెబుతూనే ఉన్నాయి. అందుకు అవసరమైన సాంకేతికపరమైన రక్షణ చర్యలు తీసుకున్నామంటున్నాయి. అయితే
కొన్నిసార్లు ప్రాక్టికల్ గా కొన్ని లోపాలు తలెత్తడంలో వీడియోలు సర్క్ యులేట్ అవుతున్నాయి.

డైలాన్ రూఫ్ ఆదర్శమన్న బ్రెంటన్..
బ్రెంటన్ కు డైలాన్ రూఫ్ వంటి అతివాదులు ఆదర్శం. ఆన్ లైన్ లో పెట్టిన డాక్యుమెంట్ లో బ్రెంటన్ ఈ విషయం వెల్లడించాడు. డైలాన్ రూఫ్ పేరు వినగానే చాలా మందికి సౌత్ కరోలినా దారుణం గుర్తుకువస్తుంది. 2015 లో దక్షిణ కరోలినాలో తొమ్మిది మంది నల్ల జాతీయులను డైలాన్ రూఫ్ కాల్చి చంపాడు. డైలాన్ ఆదర్శాలు కూడా తనకెంతో నచ్చుతాయని డాక్యుమెంట్ లో బ్రెంటన్ పేర్కొన్నాడు.