
గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. సోమవారం ఇటిక్యాల మండలం గోపాలదిన్నె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను హౌసింగ్ పీడీ శ్రీనివాసులుతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు పనులు త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
నీటి సమస్య రాకుండా చూడాలి..
వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. తన చాంబర్ లో సంబంధిత ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి, నీటి సమస్యపై మాట్లాడారు. వచ్చే నెల రోజులు చాలా కీలకమని, ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈలు పరమేశ్వరి, శ్రీధర్ రెడ్డి ఉన్నారు.