రేవల్లి, వెలుగు: వనపర్తి జిల్లా రేవల్లి కేజీబీవీలో మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ లో ఏర్పడిన సమస్యతో హాస్టల్‌కు నీరు రావడం లేదు. తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆదివారం విద్యార్థినులు బకెట్లు పట్టుకుని సమీపంలోని పంట పొలాల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకున్నారు.
నీళ్లు లేక హాస్టల్ ప్రాంగణం అంతా దుర్వాసన వెదజల్లుతోందని, నీళ్ల కోసమే సమయం అంతా వృథా అవుతోందని వాపోయారు. స్కూల్లో 250 మంది స్టూడెంట్లు చదువుకుంటుండగా, కనీస స్థాయిలోనూ నీళ్లు సప్లై కావడం లేదని అంటున్నారు. స్టూడెంట్లతో పాటు టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. పైప్‌లైన్ రిపేర్లు చేయించాలని, అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని విద్యార్థినులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
