
కల్లూరు, వెలుగు: ధాన్యంలో తరుగు తీయకుండా కొనుగోళ్లు చేపట్టాలని, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐకేపీ ఎపీఎంను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం కల్లూరు పట్టణ మెయిన్ సెంటర్లో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పుల్లయ్య బంజారా కల్లూరుకు చెందిన పలువురు రైతులు కాంటాలేసి మిల్లులకు తరలించిన ధాన్యంలో తరుగు పేరుతో మిల్లర్లు కటింగ్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానిక ఎస్సై డి. హరిత పోలీసు సిబ్బందితో చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం రైతులు ఆర్డీవో ఆఫీసుకు చేరుకుని ధర్నా చేశారు. సత్తుపల్లి మీటింగ్ లో ఉన్న ఆర్డీవో రాజేంద్ర గౌడ్ రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని ఫోన్‌లో హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ ధర్నాలో పలువురు రైతులు పాల్గొన్నారు.