నిరుద్యోగుల ఉపాధి కోసం కొత్త జోనల్ వ్యవస్థ

నిరుద్యోగుల ఉపాధి కోసం కొత్త జోనల్ వ్యవస్థ

నిజామాబాద్: ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులు ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ ఒకేసారి 80 వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేయటం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే క్రమంలో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగుల కోసం పడగల్ లో స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని సోమవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసి నిరాశకు లోనయ్యే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత కోసం ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. మిత్రుల సహకారంతో కరోనా సమయంలో సేవ చేశామన్నారు. నా నియోజక వర్గంలో ఎక్కువ మంది యువత ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. 
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దోపిడీకి గురైందన్నారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ రాష్ట్రం తెలంగాణ అని, దశాబ్దాలుగా ఉపాధి కోసం తెలంగాణ యువత గల్ఫ్ బాట పట్టారని తెలిపారు. నీళ్లు,నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించిన తెలంగాణలో ఇవన్నీ సాధించామన్నారు. తెలంగాణ వచ్చాక కొత్తగా రాష్ట్రంలో 17 వేల పరిశ్రమలు ఏర్పడ్డాయని, ప్రైవేటు రంగంలో 16 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయన్నారు. ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని కోరారు. 

 

ఇవి కూడా చదవండి

యాదాద్రిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

టీఆర్ఎస్ తో పీకే టీం..మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్

12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి