ముంబై: ఇండియన్ పికిల్ బాల్ లీగ్ (ఐబీపీఎల్)–2025 సీజన్‌లో హైదరాబాద్ రాయల్స్ తమ జట్టును ప్రకటించింది. డేటా ఆధారిత వ్యూహంతో, ఇంటర్నేషనల్ అనుభవం, దేశీయ ప్రతిభ కలిగిన ప్లేయర్లను ఎంపిక చేసుకుంది. అమెరికన్ ప్రొఫెషనల్స్ బెన్ న్యూవెల్, మేగన్ ఫడ్జ్, ఇండియా టాప్ ర్యాంకర్ దివ్యాంశ్ కటారియా, స్నేహల్ పాటిల్ వంటి ప్లేయర్‌ను తీసుకుంది.
సింగిల్స్, డబుల్స్‌లో న్యూవెల్‌కు మంచి అనుభవం ఉంది. ఇక ఏపీపీ ప్రొ విమెన్స్ డబుల్స్ వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో మేగన్ టాప్‌లో ఉంది. ఒత్తిడిలోనూ రాణించడం ఆమె ప్రత్యేకత. పీడబ్ల్యూఆర్ వరల్డ్ నంబర్‌వన్ దివ్యాంశు కటారియాను ఎంచుకోవడం జట్టుకు పెద్ద బలం. అన్ని ఫార్మాట్లలోనూ అతను అద్భుతంగా ఆడతాడు.
డబుల్స్‌లో అత్యధికంగా వెయ్యి రేటింగ్ పాయింట్లు కలిగిన స్నేహల్ పాటిల్ రాకతో జట్టు లైనప్ మరింత పటిష్టమైంది. వీరికి తోడుగా నిలకడైన ఆటతీరు ఉన్న తేజస్ గులాటీ, యువ క్రీడాకారిణి శ్రేయ చక్రవర్తిని ఎంపిక చేశారు. ఈ లీగ్ డిసెంబర్ 1 నుంచి 7 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్‌లో జరగనుంది.
రాయల్స్ జట్టు: బెన్ న్యూవెల్, మేగన్ ఫడ్జ్, దివ్యాంశు కటారియా, స్నేహల్ పాటిల్, తేజస్ గులాటీ, శ్రేయ చక్రవర్తి.
