మెదక్ జిల్లా: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి నవ వరుడితో పాటు ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం మెదక్ జిల్లా, నార్సింగి సమీపంలో జరిగింది. నార్సింగి గ్రామానికి చెందిన జెట్టి విజయ్ (2౦) కుక్కల నర్సింలు (30) ట్రాక్టర్ మీద రాయికుంట గట్టు మీది నుంచి వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ నడిపిస్తున్ విజయ్ తో పాటు, పక్కన కూర్చున్న నర్సింలు అక్కడికక్కడే మృతి చెందారు.
విజయ్ కు 5 రోజుల క్రితమే మాసాయిపేటకు చెందిన శిల్పతో పెళ్లి జరిగిందని తెలిపారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుల కుటుంబాల సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. నవ వరుడు విజయ్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న నవ వధువు కుప్పకూలి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
