వచ్చే 10 నెలలు మనకు కీలకం : సీఎం కేసీఆర్

వచ్చే 10 నెలలు మనకు కీలకం : సీఎం కేసీఆర్
  • ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలె.. టీఆర్ఎస్ మీటింగ్​లో కేసీఆర్ 
  • డౌటొద్దు.. సిట్టింగులకే టికెట్లు ఇస్తం
  • ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘా ఉంది.. మీరేం చేసినా నాకు తెలుస్తది
  • నా బిడ్డ కవితపై ఏవో కేసులు పెట్టి బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నరు  
  • బీజేపీపై యుద్ధం చేద్దాం.. 
  • ఈడీ, బోడీ మనల్ని ఏమీ చేయలేవ్ 

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని, షెడ్యూల్‌‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌ స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ పార్లమెంటరీ, లెజిస్లేటివ్‌‌ పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో గంటన్నర పాటు ఆయన మాట్లాడారు. వచ్చే పది నెలలు చాలా కీలకమని, ఎమ్మెల్యేలంతా ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలని కేసీఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘా ఉందని, ఎవరైనా పార్టీ మారాలని ఒత్తిడి చేస్తే తనకు చెప్పాలని సూచించారు. టికెట్లపై ఎవరూ డౌట్‌‌ పెట్టుకోవద్దని, సిట్టింగులకే టికెట్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ శక్తినంతా కూడదీసుకొని కష్టపడాల్సి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ఒకరికి ఇంకొకరు తోడు వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. ‘‘ప్రజలతో ఎమ్మెల్యేలకు కొంత గ్యాప్‌ రావడంతో వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజలు, పార్టీ క్యాడర్‌తో గ్యాప్‌ రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. మునుగోడులో అనుసరించిన ఫార్ములానే అన్ని నియోజకవర్గాల్లోనూ అనుసరించాలి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్ లు అన్ని కులాల వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఇకపై ప్రతి 15 రోజులకోసారి సమావేశమవుదాం. అందరం కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుదాం” అని కేసీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గంలోని సీనియర్‌ లీడర్లను ఇన్ చార్జులుగా నియమిస్తామని తెలిపారు. 

ఈడీ, ఐటీ దాడులు చేస్తే తిరగబడండి.. 

మునుగోడులో ఓడినా బీజేపీ అడ్డగోలు రాజకీయాలు ఆపడం లేదని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘మన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ దాడులకు తెగబడుతోంది. అలాంటి పరిస్థితి వస్తే గట్టిగా తిరగబడండి. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై పక్కా ఆధారాలున్నాయి. బీజేపీ ఢిల్లీ పెద్దల బండారమంతా నా దగ్గర ఉంది. కేంద్రానికి దర్యాప్తు సంస్థలుంటే మనకూ ఉన్నాయి. వాళ్లు మనపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదు. వాళ్లో మనమో తేల్చుకుందాం. ఈడీ, బోడీ, మోడీ, సీబీఐ మనల్ని ఏమీ చేయలేవు. బీజేపీతో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. తన బిడ్డ కవితపై ఏవో కేసులు పెట్టి పార్టీ మారాలని బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని, ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉంటుందా? అని మండిపడ్డారు. కాగా, బీజేపీ వికృత, అప్రజాస్వామిక శక్తులపై పోరాడుతామని సమావేశంలో తీర్మానం చేశారు. 

బీజేపీ దగ్గర 2 లక్షల కోట్లున్నయ్.. 

రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి గద్దెనెక్కేందుకు బీజేపీ ఎంతటి నీచానికైనా తెగబడుతుందని కేసీఆర్ అన్నారు. ‘‘ఏపీ సీఎం జగన్‌ కేంద్రానికి అనుకూలంగా ఉన్నారు. కేంద్రం ఏ బిల్లు తెచ్చినా మద్దతు ఇస్తున్నారు. ఆయనకు 22 మంది ఎంపీలు ఉన్నారు. అయినా ఆయన్ను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేసింది” అని ఆరోపించారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఆ పార్టీ సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు. ‘‘బీజేపీ దగ్గర రూ.2 లక్షల కోట్లు ఉన్నాయని సింహయాజీ చెప్తున్నాడు. ఒక్క పార్టీకి అంత సొమ్ము ఎక్కడిది? ఆ మొత్తాన్ని దేనికోసం వాడుతున్నారు?” అని ప్రశ్నించారు. ‘‘మునుగోడులో బీజేపీ ఏమైనా ప్రసాదాలు పంచిందా? గుండాగిరి, దాదాగిరి చేసింది. అయినా గెలవకపోవడంతో జీర్ణించుకోలేకపోతోంది. దేశంలో కాంగ్రెస్‌ అధ్యాయం ముగిసినట్టే”అని కేసీఆర్ అన్నారు.

ఇల్లు కట్టుకుంటే పైసల పథకం త్వరలోనే..  

త్వరలోనే 11.5 లక్షల ఎకరాల పోడు భూములను క్రమబద్ధీకరిస్తామని, ఈ అంశంలో కమ్యూనిస్టులు తమతో కలిసి వస్తారని కేసీఆర్ చెప్పారు. ధరణిలో 98 శాతం సమస్యలకు పరిష్కారం దొరికిందని, మిగిలిన 2శాతం సమస్యల పరిష్కారానికి త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గానికి 500 మంది చొప్పున దళితబంధు లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సొంతజాగాల్లో ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. జిల్లా పార్టీ ఆఫీసులను కేటీఆర్‌, కె. కేశవరావు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. త్వరలోనే తాను జిల్లాల పర్యటనకు వస్తానని చెప్పారు.

మంత్రులపై కేసీఆర్ అసహనం

ప్రభుత్వ పథకాలపై అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదని మంత్రులపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది నియోజవర్గాలు దాటి రావడం లేదని ఫైర్ అయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా ఎమ్మెల్యేల దగ్గర ఉండాలని, ఆ లిస్టును బూత్‌ ఇన్‌చార్జులకు పంపి పార్టీ క్యాడర్ వారితో టచ్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డబుల్‌ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు సహా ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త పనులకు బడ్జెట్ ఇచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ అత్యవసరమైతే తనను నేరుగా అడిగితే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఎమ్మెల్యేలు ఎక్కడేం చేసినా నాకు తెలిసిపోతుంది. నేను అడిగే వరకూ చూడకుండా, ఎలాంటి విషయాలున్నా సమాచారం ఇవ్వాలి” అని చెప్పారు. 

మీడియాతో మాట్లాడొద్దు..

సమావేశంలో చర్చించిన అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని ఎమ్మెల్యేలు, లీడర్లను కేసీఆర్‌‌ హెచ్చరించారు. మీటింగ్‌‌ ముగియగానే మీడియా ప్రతినిధుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు చెప్తున్నారని.. ఎవరెవరు ఎవరితో ఏ విషయాలు మాట్లాడుతున్నారో తనకు తెలుసని చెప్పారు. కేసీఆర్ హెచ్చరికలతో పార్టీ మీటింగ్‌‌ ముగిసిన అనంతరం ఎవరూ మీడియా ప్రతినిధులతో మాట్లాడలేదు.