ఇక పోరాడలేను అంటూ వీడ్కోలు.. నెయ్మార్ రిటైర్మెంట్‌తో బ్రెజిల్ ఫ్యాన్స్ ఎమోషనల్

ఇక పోరాడలేను అంటూ వీడ్కోలు.. నెయ్మార్ రిటైర్మెంట్‌తో బ్రెజిల్ ఫ్యాన్స్ ఎమోషనల్

Neymar Retirement: బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నెయ్మార్ (Neymar Jr.) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 16 పోరులో నార్వే చేతిలో బ్రెజిల్ 1–2 తేడాతో అనూహ్య ఓటమి పాలైన అనంతరం అతడు ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్ చివరి నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచిన నెయ్మార్, తన జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ను ముగించాడు. ప్రపంచకప్ ఆశలు నిరాశగా మిగిలినప్పటికీ, బ్రెజిల్ సాకర్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ప్లేయర్స్ లో ఒకడిగా తన ప్రస్థానానికి వీడ్కోలు చెప్పాడు. 

నా ప్రాణం ఇచ్చాను.. కానీ ఇక పోరాడలేను:  
తన రిటైర్మెంట్‌పై మాట్లాడిన నెయ్మార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ జట్టుతో నా సమయం పూర్తయింది. నేను చరిత్ర సృష్టించాను, చాలా సంతోషంగా ఉన్నాను.. పసుపు చొక్కా కోసం నా రక్తాన్ని, నా ప్రాణాన్ని ఇచ్చి ఎప్పుడూ పోరాడాను.. కానీ ఇప్పుడు ఇక ఆ పని చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. బ్రెజిల్ తరఫున 130 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 80 గోల్స్ సాధించిన ఆటగాడిగా నెయ్మార్ చెరగని రికార్డుతో తప్పుకున్నాడు.

►ALSO READ | టైటిల్ ఫైట్‌లో కొట్టుకోవాల్సింది పోయి.. స్టేజ్‌పైనే రొమాన్స్ ఏందక్కా.. ప్రత్యర్థికి ముద్దు పెట్టిన షీనా

శాంటోస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదాలపై క్లారిటీ: 
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కి వీడ్కోలు పలికిన నెయ్మార్, ప్రస్తుతం తన మాతృ క్లబ్ శాంటోస్ ప్రదర్శనపై దృష్టి సారించాడు. ఇటీవల మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్లను బెదిరించాడంటూ వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించాడు. నాయకుడిగా జట్టు ప్రమాణాలు పెరగాలని గట్టిగా అడగడం నా బాధ్యత.. మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా పాయింట్లు పారేసుకోవద్దని మాత్రమే చెప్పాను.. నా మాటలను తప్పుగా చిత్రీకరించడం విచారకరం.. నా స్థానంలో గాబీగోల్, లూకాస్ వెరిసిమో ఉన్నా అదే చెప్పేవాళ్లు అని నెయ్మార్ వివరణ ఇచ్చాడు.

కొపా సుడఅమెరికానా రౌండ్ ఆఫ్ 16కి శాంటోస్: 
మైదానం బయట వివాదాలు నడుస్తున్నప్పటికీ, శాంటోస్ 4–2 తేడాతో యూనివర్సిడాడ్ సెంట్రల్‌ను ఓడించడంలో నెయ్మార్ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో శాంటోస్ క్లబ్ కొపా సుడఅమెరికానా రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. తదుపరి రౌండ్‌లో ఈ బ్రెజిలియన్ క్లబ్ ఈక్వడార్‌కు చెందిన మకారా క్లబ్‌తో తలపడనుంది.