
దిశ మారింది.. దశ తిరిగింది
పురుగు మందుల అవశేషాలు లేని తిండి తినడం ఈ రోజుల్లో చాలా కష్టం.. పైగా ఖర్చుతో కూడిన వ్యవహారం. అంతేకాదు పంటల్ని కాపాడుకునేందుకు రసాయనాలు వాడటం, సాగు కోసం అప్పులు చేయడం కూడా రైతులకు తప్పని పరిస్థితి. ఈక్రమంలో ఏర్పాటైందే ‘బియాండ్ ఆర్గానిక్’. సాగు కోసం వడ్డీ లేని పెట్టుబడి అందించడం, ప్రజలు కూడా వ్యవసాయ పనుల్లో భాగస్వాములు కావడంతో పాటు ఆర్గానిక్ పద్ధతిలో పండించి పంటల్ని వినియోగదారులు అందుకోవడమే ‘బియాండ్ ఆర్గానిక్’ కాన్సెప్ట్.
చాలామంది రైతులు పత్తి, మిర్చి.. లాంటి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం, పప్పులు, తృణధాన్యాల సాగుకు ఆసక్తి చూపకపోవడంతో మార్కెట్లో వీటి లభ్యత తక్కువైంది. దీనికి తోడు అక్కడక్కడ కొందరు రైతులు పండించే పప్పులు, తృణధాన్యాలను దళారీలు కొనుగోలు చేసి.. ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుకే మంచి ధర వచ్చేలా చేయడం, వినియోగదారులే రైతులకు ముందస్తుగా వడ్డీ లేని పెట్టుబడి సాయం అందించడం, నేరుగా రైతుతో వినియోగదారుడిని కనెక్ట్ చేయడం.. అనే కాన్సెప్ట్‌కు హైదరాబాద్ శివారులోని తెల్లాపూర్‌లో ‘దిశ’ అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకారం చుట్టింది. ‘బియాండ్ ఆర్గానిక్’ పేరిట 2018 సంవత్సరంలోని ఖరీఫ్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో మొదటిసారి 92 కుటుంబాలు భాగస్వామ్యమయ్యాయి.
పది గ్రామాల ఎంపిక
గత 30 ఏళ్లుగా చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహిస్తూ, వారికి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్) సహకారంతో ‘దిశ’ కన్వీనర్, మాజీ సైనిక ఉద్యోగి దంట్లూరి సత్యనారాయణరాజు, ఆయన కూతురు తేజస్వి.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని పది గ్రామాలను ‘ఆర్గానిక్ ఫార్మింగ్’కు ఎంచుకున్నారు. ఇందులో ‘అర్జున్ నాయక్ తండా, లచ్చు నాయక్ తండా’లో సంఘాలుగా ఏర్పడిన మహిళా రైతులతో మాట్లాడి సేంద్రియ పద్ధతిలో కమ్యూనిటీ వ్యవసాయం చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2018 జూన్‌లో వాళ్లకు కావాల్సిన విత్తనాలను డీడీఎస్ ప్రతినిధుల ద్వారా అందజేశారు. విత్తనాలు వేసేటప్పుడు, కలుపుతీత సమయంలో కావాల్సిన పెట్టుబడిని రెండు దఫాలుగా ‘బియాండ్ ఆర్గానిక్స్’ సభ్యులు అందించడంతో పాటు పంటలను పరిశీలించారు. కొంతమంది సభ్యులు కలుపు పనుల్లో అప్పుడప్పుడు భాగస్వాములు కాగా, మరికొందరు వీకెండ్‌లో కుటుంబాలతో కలిసి పొలాల్లో గడపడం విశేషం.
రైతులకు తప్పిన అప్పుల బాధ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో భూగర్భ జలాలు చాలా తక్కువ. వేలకు వేలు పెట్టి బోర్లు వేసినా నీళ్లు పడతాయన్న నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాధారిత పంటలు పండించడం మినహా అక్కడి రైతులకు మరో దారి లేదు. ఏ పంట సాగుకైనా అప్పులు చేయాల్సిందే. బ్యాంకుల చుట్టూ తిరిగినా లాభం లేదు. దీంతో గ్రామాల్లోని వడ్డీ వ్యాపారుల నుంచి వందకు మూడు రూపాయలు, నాలుగు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవాలి. అయితే, అర్జున్ నాయక్ తండా, లచ్చునాయక్ తండాలకు చెందిన రైతులకు నేరుగా హైదరాబాద్ వాసులే పెట్టుబడికి డబ్బులు ఇస్తుండటంతో అప్పులు చేసే బాధ తప్పింది.
వినియోగదారుడి వాటా
రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఆర్గానిక్ పద్ధతిలో పండించే పప్పులు, తృణధాన్యాలను పొందాలనుకునే వాళ్లు పది వేల రూపాయలు లేదా పదిహేను వేల రూపాయల ప్యాకేజీల్లో ఒకదానిని ఎంచుకోవచ్చు. చిన్న కుటుంబాలకు ఏడాదిలో సరిపోయే జొన్నలు, సామలు, రాగులు, సజ్జలు, కొర్రలు, కందులు, పెసలు, మినుములు, అనుములు, బొబ్బర్లు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, అవిసెలు, ఉలవలు, కుసుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్, బెల్లం, చక్కెరను అంచనా వేసి ఈ ప్యాకేజీలు తయారు చేశారు. ముందుగా రైతులకు చెల్లించే డబ్బులకు సరిపోయేలా ఆర్డర్లు తీసుకుంటారు.
అంతా సహకరిస్తే..
గత ఏడాది వర్షాలు లేక పంట చేతికొచ్చే పరిస్థితి లేదని తెలిసి ఈ విషయాన్ని ‘బియాండ్ ఆర్గానిక్’ సభ్యుల దృష్టికి తీసుకెళ్లా. వారు ఎలా రియాక్ట్ అవుతారోనని అనుకున్నా. కానీ, వాళ్లంతా పాజిటివ్‌గా స్పందించడం సంతోషాన్నిచ్చింది. తర్వాత వర్షాలు కురిసి.. పంటలు చేతికి రావడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాం. ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు ఇలా వలంటీర్‌గా రైతుల పెట్టుబడికి సాయమందిస్తే వారికి అప్పులు చేసే బాధ తప్పుతుంది. వచ్చే నెలలో మా ప్రాజెక్టు సెకండ్ ఫేజ్‌లోకి వెళ్తుంది. గత ఏడాది సక్సెస్ కావడంతో ఈసారి చాలా మంది బియాండ్ ఆర్గానిక్స్‌లో సభ్యులుగా చేరేందుకు ముందుకొస్తున్నారు.
– తేజస్వి, బియాండ్
ఆర్గానిక్ నిర్వాహకురాలు
ఆర్గానిక్
ఆహారంతోనే ఆరోగ్యం
నాకు తెలిసిన చాలా మంది అనారోగ్యంతో చనిపోయారు. ఆహారంలో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని పదేళ్ల క్రితమే గుర్తించా. ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడమే దీనికి పరిష్కారమని భావించాను. ఇందులో వినియోగదారుడి ఆరోగ్యం, రైతుకు ప్రోత్సాహం అనే లక్ష్యంతో కొన్నేళ్లుగా నేను చేసిన ఆలోచనకు తుది రూపమే బియాండ్ ఆర్గానిక్ ప్రాజెక్టు.
– సత్యనారాయణరాజు, ‘దిశ’ కన్వీనర్