సంధ్య థియేటర్​ కేసులో..సీపీ ఆనంద్​కు ఎన్​హెచ్ఆర్సీ నోటీసులు

సంధ్య థియేటర్​ కేసులో..సీపీ ఆనంద్​కు ఎన్​హెచ్ఆర్సీ నోటీసులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య థియేటర్‎ కేసులో నేషనల్​హ్యూమన్​రైట్స్​కమిషన్​(ఎన్‌హెచ్‌ఆర్సీ) మరోసారి పోలీసులపై సీరియస్​ అయ్యింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని గురువారం సిటీ సీపీ సీవీ ఆనంద్​కు నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్‌‌లో పుష్ప 2 ప్రీమియర్‌‌ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌కు చెందిన రేవతి (39) చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌‌ (9) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనపై జనవరిలో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అప్పుడే పూర్తి నివేదిక ఇవ్వాలని చిక్కడపల్లి ఏసీపీకి, జోన్​ డీసీపీకి కమిషన్​నోటీసులు ఇచ్చింది. అయితే, పోలీసులు ఇచ్చిన రిపోర్టులో సరైన వివరాలు లేవని మొట్టికాయలు వేసింది. అల్లు అర్జున్​వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీకి చెప్పగా.. పోలీస్ ​స్టేషన్​కు కూతవేటు దూరంలో ఉన్న థియేటర్​ దగ్గర డీజేలు పెట్టి, హంగామా చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది.

తొక్కిసలాట పోలీసుల లాఠీచార్జి వల్ల జరగలేదని.. అల్లు అర్జున్​ రావడం వల్లే జరిగిందని పోలీసులు రిపోర్టులో పేర్కొనగా.. దానికి స్పందిస్తూ.. అనుమతి నిరాకరించినప్పుడు  షో టైంలో అల్లు అర్జున్​ ఎలా వచ్చాడని, అంతమంది గుమిగూడినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నట్టు అర్థమవుతోందని, తమకు ఇచ్చిన రిపోర్టులో కూడా సరైన వివరాలు లేవని కమిషన్​ పేర్కొన్నది. అందుకే మరోసారి నేరుగా సీపీ సీవీ ఆనంద్​కు నోటీసులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికైనా  ఘటనపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది.