యూఎస్ వడ్డీ రేట్ల ప్రకటనతో పతనమైన గ్లొబల్ మార్కెట్

యూఎస్ వడ్డీ రేట్ల ప్రకటనతో పతనమైన గ్లొబల్ మార్కెట్

ముంబై: గత రెండు సెషన్లలో లాభాల్లో ముగిసిన బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌లకు గురువారం షాక్ తగిలింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను అంచనాలకు  అనుగుణంగానే పెంచినప్పటికీ, మానిటరీ పాలసీ వైఖరీ కఠినంగానే ఉంటుందని ప్రకటించడంతో గ్లోబల్‌‌ మార్కెట్‌‌లతో పాటు మన మార్కెట్‌‌లు  భారీగా పతనమయ్యాయి. స్వల్ప నష్టాల్లో ఓపెన్ అయిన నిఫ్టీ, ఇంట్రాడేలో మరింత కిందకు పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ, ఇన్ఫోసిస్  వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు మార్కెట్‌‌ను కిందకి లాగాయి.  30 షేర్లున్న సెన్సెక్స్ గురువారం 879 పాయింట్లు (1.40%) తగ్గి 61,799 వద్ద క్లోజయ్యింది.  ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా ఈ ఇండెక్స్ నష్టపోయింది. నిఫ్టీ  245 పాయింట్లు తగ్గి 18,415 వద్ద ముగిసింది. ‘హాకిష్ (వడ్డీ రేట్లు ఇంకా పెంచుతామని) సంకేతాలు ఇచ్చి  మార్కెట్లను ఫెడ్ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఇన్‌‌ఫ్లేషన్ దిగిరావడంతో ఈసారి ఫెడ్ మీటింగ్‌‌లో మానిటరీ పాలసీని సులభం చేస్తారని ఇన్వెస్టర్లు అంచనావేశారు.  బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌‌, యురోపియన్ సెంట్రల్ బ్యాంక్‌‌ల పాలసీ మీటింగ్‌‌లు  ఉన్నాయి. మార్కెట్ వీటిపై దృష్టి పెట్టింది. ఈ రెండు సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచే అవకాశం ఉంది’ అని జియోజిత్‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్‌‌ వినోద్ నాయర్ అన్నారు.

కాగా, వరుసగా నాలుగు మీటింగ్‌‌లలో వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచిన ఫెడ్‌‌, తాజా మీటింగ్‌‌లో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో  యూఎస్‌‌లో వడ్డీ రేట్లు 4.25– 4.5 శాతానికి చేరుకున్నాయి.  కానీ, వడ్డీ రేట్లను  5.1 శాతం వరకు పెంచుతామని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి మార్కెట్‌‌లు నెగెటెవ్‌‌గా స్పందించాయి. సెన్సెక్స్‌‌లో టెక్‌‌ మహీంద్రా, టైటాన్‌‌, ఇన్ఫోసిస్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ, ఐటీసీ షేర్లు  2–4 శాతం వరకు నష్టపోయాయి. సెక్టార్ల పరంగా చూస్తే  నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.14 శాతం, పీఎస్‌‌యూ బ్యాంక్‌‌ 2 శాతం పతనమయ్యాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్‌‌ ఇండెక్స్‌‌లు కూడా భారీగానే పడ్డాయి. మిడ్‌‌క్యాప్‌‌50 ఇండెక్స్‌‌ 1.2 శాతం నష్టపోగా, స్మాల్‌‌క్యాప్‌‌50 ఇండెక్స్ 0.60‌‌‌‌ శాతం తగ్గింది.  డాలర్ మారకంలో రూపాయి విలువ 30 పైసలు తగ్గి 82.76 వద్ద సెటిలయ్యింది.

ఐటీ షేర్లకు గడ్డు కాలం..

గత ఐదేళ్ల నుంచి మంచి లాభాలిస్తూ వస్తున్న ఐటీ షేర్లు ఈ ఏడాది ఇన్వెస్టర్లకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి.  2017 లెవెల్‌తో పోలిస్తే   నిఫ్టీ ఐటీ ఇండెక్స్ నాలుగు రెట్లు పెరగగా, 2020, 2021 లో  వరుసగా 54.9 శాతం, 59.6 శాతం లాభపడింది. కానీ, ఈ ఏడాది  24 శాతం నష్టపోయింది.  2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ఐటీ షేర్లు ఇంతలా పడడం ఇదే మొదటిసారి. 2008  లో  ఐటీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌ 87.5 శాతం క్రాష్ అవ్వగా, 2004 లో (డాట్‌‌‌‌కామ్ బబుల్‌‌‌‌) 54.6 శాతం పడింది.  ఐటీ, టెక్‌‌‌‌ షేర్లన్నీ ఈ ఏడాది భారీగా పతనమయ్యాయి.  విప్రో, టెక్‌‌‌‌ మహీంద్రా, ఎంఫాసిస్‌‌‌‌,  ఎల్‌‌‌‌టీఐమైండ్‌‌‌‌ట్రీ షేర్లయితే ఈ ఏడాదిలో 40 శాతం పతనమయ్యాయి. 

కొత్త ఏడాది  కలిసొచ్చేనా?

యూఎస్, యూరప్‌‌‌‌లలో  రెసిషన్ వస్తుందనే భయాలు ఎక్కువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ షేర్లు తిరిగి నిలదొక్కుకోవడం కష్టమేనని ఎనలిస్టులు చెబుతున్నారు. ఐటీ కంపెనీల వాల్యుయేషన్లపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. గతంలో యూఎస్‌‌‌‌, యూరప్‌‌‌‌ దేశాల ఎకానమీ స్లోడౌన్ అయినప్పుడు   దేశ ఐటీ సెక్టార్‌‌‌‌ వాల్యుయేషన్‌‌‌‌ 20–60 శాతం వరకు పడిపోయింది.  ‘యూఎస్ ఎకానమీ స్లోడౌన్‌‌‌‌ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో   గత రెండేళ్లతో పోలిస్తే కంపెనీలు చేసే ఐటీ ఖర్చులు  తక్కువగా ఉంటాయి. వచ్చే ఏడాది ఐటీ కంపెనీల గ్రోత్‌‌‌‌ సింగిల్ డిజిట్‌‌‌‌లోనే ఉంటుందని అంచనావేస్తున్నాం’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా ఎనలిస్ట్ అమిష్ షా అన్నారు. 

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ ఐటీ షేర్లను దశల వారీగా కొనుక్కోవాలని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్ ఒక్క ఇన్ఫోసిస్‌‌‌‌పైనే  ‘బై’ రికమండేషన్స్‌‌‌‌ను ఇచ్చింది. మరో కంపెనీ బీఎన్‌‌‌‌పీ పారిబాస్ ఇన్ఫోసిస్, టీసీఎస్‌‌‌‌ మినహా మిగిలిన  ఐటీ కంపెనీలపై తమ ఎక్స్‌‌‌‌పోజర్‌‌‌‌ (తమ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల) ‌‌‌‌ను తగ్గించేసింది. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ సెక్యూరిటీస్  ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై పాజిటివ్‌‌‌‌గా ఉన్నా, జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. క్లౌడ్ టెక్నాలజీకి అలవాటు పడుతుండడం, డిజిటైజేషన్ పెరుగుతుండడంతో ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై  ఈ కంపెనీ పాజిటివ్‌‌‌‌గా ఉంది.  వచ్చే ఏడాది కోసం 8 షేర్లను ఈ కంపెనీ రికమండ్ చేయగా, ఇందులో ఇన్ఫోసిస్ కూడా ఉంది.