డ్రోన్ దాడిలో 85 మంది మృతి

డ్రోన్ దాడిలో 85 మంది మృతి
  • టెర్రరిస్టులే లక్ష్యంగా నైజీరియా ఆర్మీ అటాక్
  • గురితప్పడంతో ప్రాణాలు కోల్పోయిన సామాన్యులు

అబుజా: నైజీరియాలో ఘోరం జరిగింది. టెర్రరిస్టులు లక్ష్యంగా అక్కడి ఆర్మీ డ్రోన్ అటాక్ చేయగా, అది గురి తప్పి జనంపై పడింది. ఈ ఘటనలో 85 మంది చనిపోయారు. మరో 66 మంది గాయపడ్డారు. ఉత్తర నైజీరియాలో టెర్రరిస్టులు, రెబెల్ గ్రూప్స్ తో గత పదేండ్లుగా ఆర్మీ పోరాడుతోంది. ఈ క్రమంలో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. అయితే ఎయిర్ స్ట్రైక్స్ తరచూ గురి తప్పి సామాన్య జనం చనిపోతున్నారు. కడూనా రాష్ట్రంలోని తుడున్ బిరి గ్రామంలో టెర్రరిస్టులు, బందిపోట్లు దాక్కున్నారని సమాచారం అందుకున్న ఆర్మీ.. వాళ్లను లక్ష్యంగా చేసుకుని ఆదివారం రాత్రి డ్రోన్ అటాక్ చేసింది. అయితే అది గురి తప్పి రెసిడెన్షియల్ ఏరియాలో పడింది.

మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు అంతా ఒకచోట చేరి ప్రార్థనలు చేస్తున్న ప్లేసులో డ్రోన్ బాంబు పడింది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ‘‘ఇప్పటి వరకు 85 డెడ్ బాడీలను గుర్తించాం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది” అని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. చనిపోయినోళ్లలో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని పేర్కొంది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులను నైజీరియా ప్రెసిడెంట్ బోలా టినుబు ఆదేశించారు. కాగా, నైజీరియాలో అమాయక జనం ప్రాణాలు కోల్పోతుండడంతో మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.