చలో చార్మినార్‌‌ నైట్ బజార్

చలో చార్మినార్‌‌ నైట్ బజార్

చార్మినార్‌‌ను పగలు చూడడం వేరు. రాత్రి చూడడం వేరు. అదికూడా రంజాన్‌‌ నెల రాత్రిపూట ఎర్రరంగు, తెల్లరంగు, పచ్చరంగు కరెంట్‌‌ బల్బ్‌‌ లైటింగ్‌‌ల మధ్య చార్మినార్‌‌ను చూస్తుంటే భలే ఉంటది ఆ ఫీలింగ్‌‌. దగ్గరిదాంక పోయి చార్మినార్‌‌ను చూసేలోపె ‘నైట్‌‌బజార్‌‌’ హడావిడి వెల్‌‌కం చెప్తది. మిగతా రోజుల్లో చేసే షాపింగ్‌‌కు ఈ నైట్‌‌బజార్‌‌లో  చేసే షాపింగ్‌‌కు మస్త్‌‌ తేడా ఉంటది.

అదెట్లంటే పురానా పూల్ నుంచి లేదంటే నయాపూల్ నుంచి ఎట్లకెల్లి షురూ చేసినా… మనుషుల మధ్య నుంచి దారి చేసుకుంట, చూసుకుంట ఒక్కో అడుగు ఎయ్యాల్సిందె. అట్ల పోతంటె ఒక పక్క నుంచి హలీం ఘుమఘుమలు రారమ్మని పిలుస్తయ్‌‌. ఇగ నోరాగుతాది… ఆ ఇంత హలీం నోట్లో వేసుకుని మరో అడుగు ఏద్దురుగదా రంగురంగుల గాజుల సప్పుడు…  అత్తరు వాసనలు… ఇంట్ల కిటికీలకు, తలుపులకి  వేలాడదీసే కర్టెన్లు, చాయ్‌‌కప్పులు, డిన్నర్‌‌సెట్లు, రంగురంగుల ఫ్లవర్‌‌ వేజ్‌‌లు, మెత్తచెప్పులు, గట్టిచెప్పుల దాంక ఉంటయ్‌‌.  తిరిగి తిరిగి దూపయితె తాగనీకి పళ్ల రసాలు, ఫలుదా, లస్సీ, కుల్ఫీ ఐస్‌‌క్రీం బండ్లు వరసన కనబడతనె  ఉంటయ్‌‌. కంటికి నచ్చింది కొని, మనసు మెచ్చింది  తీసుకుని ఇంటికొస్తె… నైట్‌‌బజార్‌‌లో తిరిగిన ఫీలింగ్‌‌   మళ్ల రంజాన్‌‌ నెల వచ్చెదాంక  మిమ్మల్ని వదిలిపోదు.

పాతబస్తీ రైతులు

‘గుడ్‌‌‌‌ అర్త్‌‌‌‌’ అనే కవితలోని రైతు ఈ మాట అంటాడు.  నోబెల్‌‌‌‌ బహుమతి గ్రహీత పర్ల్స్‌‌‌‌ ఎస్‌‌‌‌. బక్‌‌‌‌ రాసిన ఈ కవితలో రైతు.. నేలను అమ్ముకోవడం అంటే తనని అమ్ముకోవడమే అంటాడు. ఆ రైతులాంటి వాడే పాతబస్తీ వాసి. ప్రపంచంలోని గొప్ప పర్యాటక ప్రదేశమైన చార్మినార్‌‌‌‌ చెంతనే ఉన్న గజం భూమి లక్షల రూపాయల ధర పలుకుతుంది. కోట్ల రూపాయలొస్తాయని చిన్న ఇల్లు అమ్ముకుని పెద్ద మేడలోకి మారడు చిరు వ్యాపారి. రేకుల షెడ్డులోనో, చిన్న గదిలోనో వ్యాపారం చేస్తాడు. కానీ దానిని వదులుకోడు. అది వేలు పట్టి నడిపించిన తాతల వారసత్వమని గర్వపడతాడు. సాదాసీదా జీవితంతో ఆ వారసత్వాన్ని నిలబెట్టాలని తాపత్రయపడతాడు. ఈ ప్రేమే గంగాజమునా తెహజీబ్‌‌‌‌ని చార్మినార్ వీధుల్లో జీవనదిలా నడిపిస్తోంది.

నాలుగు వందల ఏళ్ల చరిత్ర చార్మినార్‌‌‌‌. సాలార్‌‌‌‌జంగ్‌‌‌‌ మ్యూజియం నుంచి ఫలక్‌‌‌‌నుమా వరకు పర్యాటకుల సందడి కనిపిస్తోంది. చార్మినార్‌‌‌‌ పక్కనే ఉండే మక్కా మసీదులో నమాజ్‌‌‌‌ ముగిసిన తర్వాత ఆ పరిసరాలంతా కలియతిరిగే టూరిస్టులు, చౌమహల్లా ప్యాలెస్‌‌‌‌, పురానీ హవేలీ, సాలార్‌‌‌‌జంగ్‌‌‌‌ మ్యూజియం చూసివస్తారు. లాడ్‌‌‌‌ బజార్‌‌‌‌ గాజుల అందాలు చూసి, ముర్గీ చౌకీలోని అందమైన చిలుకల్ని పలకరించి వస్తారు. మహబూబ్‌‌‌‌ చౌక్‌‌‌‌ క్లాక్‌‌‌‌ టవర్‌‌‌‌, సినిమాల్లో కోర్టు సన్నివేశాల్లో అలరించే సిటీ కాలేజ్‌‌‌‌, వార్తల్లో కనిపించే హైకోర్ట్‌‌‌‌ను చుట్టి వచ్చే యాత్రకు చార్మినారే చిరునామా.

అత్తరు మాటలు

పరిమళం ఒలికిపోకుండా అత్తరు సీసా బిరడాలన్నీ గట్టిగానే బిగించి ఉన్నాయి. కానీ అత్తరు వాసన ధూళినిండిన గాలిని పవిత్రం చేస్తోంది. ఎక్కడిదీ పరిమళం? ఆలోచిస్తుంటే.. మనసుకు తట్టింది. ఇది అత్తరు సాయిబు మాటల పరిమళం. ఎన్ని అత్తరులో, అన్ని సువాసనలు. మాటలకు పరిమళాలద్ది..  వచ్చే పోయేవారికి ఆ సువాసనల్ని వినిపిస్తున్నాడు సయ్యద్‌‌‌‌ మాజిద్‌‌‌‌.  అతని మాటలు రకరకాల పరిమళాల్ని మనసుకి గుర్తుచేస్తున్నాయ్‌‌‌‌. కాళ్లకింద ప్రవహించే డ్రైనేజీ వాసన్ని రపిస్తున్నాయి. అత్తరు సువాసనంత గొప్పగా ఉంటుంది అత్తరు సాయిబు పిలుపు.

‘ఆవో.. ఆవో’ అంటూ ఆహ్వానిస్తూనే ‘దేఖో.. దేఖో’ అంటూ జేబులోని డబ్బులు చూడకుండానే మన తాహతుకు తగ్గ అత్తరు సీసాని ఎత్తిపట్టి  ప్రేమగా అంటగట్టేస్తాడు. మాటల సువాసనతోనే మనసు దోచేస్తాడు. అతడికి మాటలు అత్తరుతో పెట్టిన విద్య. హుందాగా ఉండే జంటిల్‌‌‌‌మెన్లు కోరుకునే ‘అమానత్‌‌‌‌ అత్తరు’లాగే పేద, ధనిక తేడాలేకుండా మర్యాదగా వ్యవహరించడం ఈ అత్తరు సాయిబుల గొప్పతనం.మదీనా కూడలిలో నిల్చున్న మాజిద్‌‌‌‌ మాటలే  కాదు ! చార్మినార్‌‌‌‌ కూడలికి దారి తీసే వీధులన్నిటా ఉన్న అత్తరు సాయిబుల ఆత్మీయత పాతబస్తీ వీధుల్ని సుగంధాలతో నింపుతుంది.

గరీబులైనా.. అమీరులైనా..

పాతబస్తీ మార్కెట్లలో సేమియాలను కేజీల కొద్దీ కొనే గరీబులు, క్వింటాళ్ల కొద్దీ కొనే నవాబులూ వస్తుంటారు. ఫకీరైనా, అమీరైనా ఈ షాపుల ముందు నిల్చోవాల్సిందే. రూమీ టోపీల వాళ్లకు ప్రత్యేక మర్యాదలుండవు. దేవుడి ముందు అందరూ సమానులే. మసీదులో ఉన్న సమానత్వాన్ని దుకాన్‌‌‌‌లోనూ పాటించాలె. డబ్బుకు దాసోహం కాని అంగళ్లలో మాల్‌‌‌‌ గురించి చెప్పాలా? నికార్సైనది.

అందుకే ఎంతో దూరం నుంచి సేమియాలు, కర్జూరాలు, డ్రైఫ్రూట్స్‌‌‌‌ కోసం పల్లెల నుంచి పాతబస్తీకి రోజూ వేల మంది వస్తున్నారు. ‘హైదరాబాద్‌‌‌‌కు దగ్గర్లోనే ఉన్న పల్లెలు, పట్నాల నుంచే కాదు మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌, కర్నూలు, అనంతపురం, విజయవాడ, నెల్లూరు నుంచి కూడా వస్తారని పత్తర్‌‌‌‌గట్టి (నిజాం కాలంలో నిర్మించిన మార్కెట్‌‌‌‌)లో కిరాణా సరుకుల వ్యాపారి సయ్యద్‌‌‌‌ సలీం చెప్పిండు.

నెల రోజుల వ్యాపారం

ఇరుకు ఇళ్లలో ఉండే పాతబస్తీ బతుకులు బాగుపడే మాసం ఇది.  ఈ చిరు వ్యాపారుల్లో  కూలీనాలి చేసుకునే జనమే ఎక్కువ. సిటీలో కూలి పనులకు పోయేవాళ్లంతా ఈ నెల రోజులూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. అత్తర్లు, చెప్పులు, క్రాకరీ, డోర్‌‌‌‌ కర్టెన్లు, ఫ్లవర్‌‌‌‌ వేజ్‌‌‌‌లు, వాచీలు, కళ్లజోళ్లు, పైజమాలు, బురఖాలు, టోపీలు, సమోసాలు, ఛాయ్‌‌‌‌లు,  మిఠాయిలు, సుర్మా, గాజులు, దుస్తులు, ఆభరణాలు, ఫ్రూట్స్‌‌‌‌, లక్క గాజులు అమ్మే వాళ్లలో ఇలాంటి వాళ్లే ఎక్కువ.

ఆటో మొబైల్‌‌‌‌ షాపులో డెంటింగ్‌‌‌‌ పని చేసే సయ్యద్‌‌‌‌ మాజిద్‌‌‌‌ ఇప్పుడు మదీనా ముందు అత్తర్లు అమ్ముతున్నడు. చెట్టా బజార్‌‌‌‌లో చిన్న షాపులో ఏడాదంతా టోపీలు అమ్మే షేక్‌‌‌‌ జునెయిద్‌‌‌‌ కూడా చార్మినార్‌‌‌‌ వీధుల్లో నిలబడి రకరకాల టోపీలమ్ముతున్నడు. పెద్ద వ్యాపారినీ, చిన్న వ్యాపారినీ ఒకే దారిలో నిలబెట్టింది రంజాన్‌‌‌‌. ‘దేడ్‌‌‌‌ సౌ.. దేడ్‌‌‌‌ సౌ, ఫిఫ్టీ.. ఫిఫ్టీ’ అంటూ కేకలు వేస్తూ కస్టమర్లను ఆకర్షించే వీళ్లంతా ఈ ఒక్కనెల తర్వాత మళ్లీ వేరే పనుల్లో మునిగిపోతారు.

వ్యాపారులంతా మగవాళ్లే. అయినా ఆడవాళ్ల ఉపాధికి హామీ ఉంది. రంగు రంగుల దుస్తులపై మెరిసిపోయే చమ్కీలు, ఎంబ్రాయిడరీల పనితనమంతా ఆడవాళ్లదే. చార్మినార్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ అంటే టక్కున గుర్తొచ్చేది లక్క గాజులే. ఆ లక్కగాజుల తయారీలోనూ ఆడవాళ్లుంటారు. కనిపించని వాళ్లంతా ప్రపంచానికి పరిచయమయ్యేది ఈ అందమైన వస్తువులతోనే.

మతం లేని పండుగ

పాతబస్తీలో  ముస్లింల పండుగ, హిందువుల పండుగనే తేడాలుండవు. క్రైస్తవులు, జైనులు, పార్శీలూ అంతే. ముస్లింల ఇళ్లలో జరిగే పండుగ హిందువుల ఇళ్లలో నవ్వులు పూయిస్తుంది. రంజాన్‌‌‌‌ రోజు విందు కోసం ముస్లింలు కొత్త క్రాకరీని కొంటారు. అందమైన పోర్సిలిన్‌‌‌‌ ప్లేట్లు, కప్పులు కొనేందుకు ఇష్టపడతారు. హిందూ, ముస్లిం వ్యాపారులకు లాభాలే లాభాలు. పత్తర్‌‌‌‌గట్టీలోని ఆభరణాల షాపుల్లో హిందువులు, జైనులు కూడా ఉంటారు. ఈ సీజన్లో వ్యాపారులకు లాభాలు, పని వాళ్లకు బోనస్‌‌‌‌లు ఇస్తుందీ రంజాన్‌‌‌‌.

రంజాన్‌‌‌‌ రక్షా బంధన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌లో రంజాన్‌‌‌‌ అందరి పండుగ. ఒకరి ఇంట్లో జరిగే వేడుక ఇంకొన్ని ఇళ్లకు ఉపాధి. బిడ్డలకు తియ్యని ఖుర్బానీ కొనివ్వాలన్నా, కొత్త బట్టలు కట్టాలనే భార్య మురిపెం తీర్చాలన్నా చేతినిండా పని దొరకాలె. పనికి భరోసా ఇచ్చేది పండుగలే అంటున్నడు కుమ్మరి నర్సింహ. మహారాష్ట్ర (నాందేడ్‌‌‌‌) లోని హనెగమ అనే పల్లెటూరు. కుండలు చేసే నాన్నకు సాయపడుతూ చిన్నప్పుడు మట్టి తొక్కిండు. కులవృత్తి బువ్వ పెట్టలేదు. పదేళ్లకింద బతుకుదెరువు కోసం హైదరాబాద్‌‌‌‌ వచ్చిండు. షాదాబ్‌‌‌‌ హోటల్లో చేరిండు. కమ్మని హలీం వండుతున్నడు. కుమ్మరి మట్టి తొక్కిన అనుభవం హలీం తయారీలో గోటీ (రోకలి లాంటిది)తో దంచడానికి ఉపయోగపడిందని నర్సింహ అంటున్నడు. ఏదయితేనేం మెత్తగా ప్రిపేర్‌‌‌‌ చేయడమే కదా!

పొద్దున మొదలుపెడితే సాయంత్రానికి రెడీ అయ్యే హలీం కోసం ఎంతో మంది పనివాళ్లు కావాలి. ఈ హలీం తయారీ కోసం మతబేధం లేకుండా పనిచేస్తున్నారు. ఫంక్షన్‌‌‌‌ హాళ్లలో పని చేసే సంతోష్‌‌‌‌ రోజుకి 400 రూపాయలు సంపాదిస్తాడు. ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని ఉండదు. రంజాన్‌‌‌‌ వచ్చిందంటే అతనికి నెల రోజులు చేతినిండా పని ఉన్నట్టే. మహారాష్ట్రలోని ‘లోని’ అనే ఊరు నుంచి వచ్చిన సంతోష్‌‌‌‌ ఇంటికి డబ్బులు పంపేది రంజాన్‌‌‌‌ తర్వాతే. ఆ తర్వాత రోజుల్లో తన ఖర్చులు తీరితే చాలంటున్నడు.

నయా జమానా

ఈ చార్మినార్‌‌‌‌ చుట్టూ ఎన్నో కథలున్నాయి. 125 ఏళ్ల మఖ్దూం బ్రదర్స్‌‌‌‌ కుర్తా, పైజమాలు, షేర్వాణీలకు ఫేమస్‌‌‌‌. పేరు మోసిన డిజైనర్లుండే జూబ్లీహిల్స్‌‌‌‌, బంజారాహిల్స్‌‌‌‌ను కాదని వందల మంది ప్రముఖులు పాతబస్తీలోని మఖ్దూం బ్రదర్స్‌‌‌‌నే ఆదరిస్తున్నరంటే ఆ బ్రాండ్‌‌‌‌ ఇమేజే కాదు పనిలో నిబద్ధత అలాంటిది. పాతబస్తీలో ఇలాంటి బ్రాండ్స్‌‌‌‌ చాలానే ఉన్నాయి. మదీనా హోటల్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ క్యాప్స్‌‌‌‌, నిమ్రా కెఫే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! చిల్లర వ్యాపారంలోకి కార్పొరేట్స్‌‌‌‌ వచ్చినా వాళ్ల వ్యాపార సామ్రాజ్యం మూసీని దాటలేదు. పాతబస్తీ విశ్వాసానికి మారుపేరు ఈ బ్రాండ్లని స్థానికులే కాదు జిల్లాల వాళ్లూ ఆదరిస్తున్నారు.

చార్మినార్‌‌‌‌కు పోయే మదీనా దారిలో ఓ విదేశీ బ్రాండ్‌‌‌‌ అడుగుపెట్టింది. ఐరోపా సూటు వద్దని షేర్వాణిని ఆదరించిండు నిజాం. ఆ తరమంతా అలాగే నడిచింది. నేటి తరం పెండ్లిలో షేర్వాణీ, రిసెప్షన్‌‌‌‌లో సూట్‌‌‌‌ వేసుకుంటానంటోంది. మారిన అభిరుచికి తగ్గట్టే సూట్‌‌‌‌ డిజైనింగ్‌‌‌‌లోనూ మఖ్దూం బ్రదర్స్‌‌‌‌ పేరు తెచ్చుకుంది. రోడ్డుపై చిల్లర వ్యాపారం చేసే వాళ్లు రూమీ టోపీలకు కొత్తగా చమ్కీలు జోడించి ఆకట్టుకుంటున్నారు. ట్రెండ్స్‌‌‌‌కి అనుగుణంగా ట్రెడిషనల్‌‌‌‌ వ్యాపారులందరూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. పాతబస్తీ సోల్‌‌‌‌ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆదాబ్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌.

– నాగవర్ధన్‌‌ రాయల