కర్ఫ్యూ పాస్​​ చూపమన్నందుకు పోలీస్​ చెయ్యి నరికేసిన్రు

కర్ఫ్యూ పాస్​​ చూపమన్నందుకు పోలీస్​ చెయ్యి నరికేసిన్రు
  • మరో ఇద్దరికి గాయాలు.. పంజాబ్​లో నిహంగ్స్​ దాడి
  • తొమ్మిది మంది దుండగులను అరెస్ట్​ చేసిన పోలీసులు
  • వారి నుంచి పదునైన ఆయుధాలు, పెట్రోల్​ బాంబులు స్వాధీనం

ఛండీఘర్: కర్ఫ్యూ పాస్​లు చూపించాలని అడిగినందుకు ఓ పోలీస్​ ఆఫీసర్​ పై దాడి చేసి అతడి చెయ్యి నరికేశారు పలువురు దుండగులు. వారి దాడిలో మరో ఇద్దరు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పంజాబ్​లోని పటియాలా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 6.15 నిమిషాల సమయంలో వెజిటబుల్​ మార్కెట్​ దగ్గర నిహంగ్స్(సంప్రదాయ ఆయుధాలు ధరించి, లూజ్​ బ్లూ టాప్​ వేసుకుని తిరిగే సిక్కులు) నలుగురైదుగురు ఒక గ్రూప్​గా ఓ వాహనంలో వెళుతున్నారు. వారిని అక్కడ ఆపిన పోలీసులు.. లాక్​డౌన్​ ఉండటంతో కర్ఫ్యూ పాస్​ చూపించాలని అడిగారు.. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వారు అక్కడ ఏర్పాటు చేసిన బారీకేడ్లను, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని పటియాలా సీనియర్​ సూపరింటెండెంట్​ ఆఫ్ పోలీస్ మన్​దీప్​ సింగ్​ సిద్ధు చెప్పారు. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులపైనా వారు దాడి చేశారన్నారు. తమ దగ్గర ఉన్న కత్తితో ఒక ఏఎస్ఐ చేతిని నరికేశారని, ఒక ఎస్​ హెచ్​వో, మరో పోలీసు అధికారిక కూడా ఈ దాడిలో గాయపడినట్టు తెలిపారు. గాయపడిన ఏఎస్ఐని రజింద్రా హాస్పిటల్​కు తరలించారని, అతడిని ఛండీఘర్​లోని పీజీఐఎంఈఆర్​ కు రిఫర్​ చేశారన్నారు. పోలీసులపై దాడి చేసిన నిహంగ్స్​ అక్కడి నుంచి పరారయ్యారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మరో 20 మంది వరకూ నిహంగ్స్​ ను అదుపులోకి తీసుకున్నారు. బల్బేరా గ్రామంలోని ఓ గురుద్వారాలో దాక్కున్న వీరి నుంచి పదునైన ఆయుధాలు, ఆటోమాటిక్ వెపన్స్, పెట్రోల్​ బాంబులు, రూ.35 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.