ఉత్తరాఖండ్‌లో ట్రెక్కర్లు మృతి

 ఉత్తరాఖండ్‌లో ట్రెక్కర్లు మృతి
  •  ఐదుగురు దుర్మరణం.. అంతా కర్నాటకకు చెందిన వాళ్లే..
  • మరికొందరి ఆచూకీ గల్లంతు
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బెంగళూరు: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా కర్నాటకకు చెందిన ఐదుగురు ట్రెక్కర్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ.. మనేరి ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందాన్ని మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కి.మీ.ల దూరంలో ఉన్న ట్రెక్కింగ్ పాయింట్​వద్దకు పంపించింది.

 ఇందులో ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు కర్నాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు ఉన్నారు. అయితే, ఈ టీం మంగళవారం సహస్రతల్‌ మయాలిలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న పాయింట్​వద్దకు చేరుకుంది. ఆపై శిబిరానికి తిరిగి వస్తుండగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంచు తుపాను రావడంతో వారంతా గల్లంతయ్యారు.

 ఈ ప్రమాదం గురించి కర్నాటక ప్రభుత్వానికి తెలియడంతో.. అధికారులు వెంటనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం, మౌంటెనీరింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ హోంశాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడి జిల్లా యంత్రాంగం  స్థానికంగా అందుబాటులో ఉన్న హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించింది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే ఐదుగురు ట్రెక్కర్లు మరణించారు. కొంతమంది ట్రెక్కర్లను రక్షించి.. డెహ్రాడూన్‌లోని సురక్షిత ప్రదేశానికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.