పుష్ అప్స్ తో మణిపూర్ యువకుడి గిన్నిస్ రికార్డు

పుష్ అప్స్ తో మణిపూర్ యువకుడి గిన్నిస్ రికార్డు

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు మణిపూర్ కు చెందిన యువకుడు. బాల్యం నుంచే కఠోరంగా శ్రమించి ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నారు. మణిపూర్ కు చెందిన 24ఏళ్ల థౌనఓజమ్ నిరంజోయ్ సింగ్ నిమిషం వ్యవధిలో 109 పుష్ అప్స్ చేసి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాడు. 2009లో బ్రిటన్ కు చెందిన గ్రహం మాలే అనే వ్యక్తి పేరిట ఉన్న రికార్డును నిరంజోయ్ తిరగరాశాడు. అయితే ఇదేమంతా ఆషామాషీగా జరిగిందేం కాదు.. దాని వెనుక 13 ఏళ్ల కఠోర శ్రమ దాగి ఉంది. 

నిరంజోయ్ గిన్నిస్ రికార్డులకెక్కడం ఇదే మొదటిసారి కాదు. అతని పేరిట ఇప్పటికే రెండు గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. 2019లో ఒక్క నిమిషంలో అత్యధిక వన్ ఆర్మ్, వన్ లెగ్ పుషప్స్ తోపాటు 2020లో వన్ ఆర్మ్ పుషప్స్ చేసిన ఘనత నిరంజోయ్ సొంతం. మణిపూర్ కు చెందిన యువకుడు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సంతోషం వ్యక్తం చేశారు. నిరంజోయ్ విజయం పట్ల గర్వంగా ఫీలవుతున్నానంటూ ట్వీట్ చేశారు. గిన్నిస్ రికార్డు బద్దలుకొట్టిన అతన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.