- కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సాయంత్రం కలెక్టరేట్లో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి కలెక్టర్ ప్రెస్మీట్ నిర్వహించిన మాట్లాడారు. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో 180 వార్డులకు 244 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆర్వోలు, ఏఆర్వోలు, ఇతర అధికారుల విధులకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ మొదలుకొని, పోలింగ్ ప్రక్రియ ముగిసేంతవరకు పటిష్ట పోలీసు బందోబస్తు కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, భైంసా ఏఎస్పీ రాజేశ్ మీనా, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
