ఫారెస్ట్​ క్లియరెన్స్​ లేక అభివృద్ధికి అడ్డంకులు

ఫారెస్ట్​ క్లియరెన్స్​ లేక అభివృద్ధికి అడ్డంకులు
  • ఏళ్ల తరబడి తప్పని ఎదురుచూపులు
  • నిధులు మంజూరైనా ప్రయోజనం శూన్యం
  • కిలోమీటర్ల కొద్ది నడుస్తున్న జనం

నిర్మల్,వెలుగు: నిర్మల్​ జిల్లాలోని మారుమూల పల్లెల రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రాక జనం ఇబ్బంది పడుతున్నారు. ఏండ్ల తరబడి రోడ్లు లేక కాలి నడకనే రావాల్సి వస్తోంది. రోడ్లు సరిగా లేక గిరిజన పల్లెలు, తండాల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. వర్షాకాలంలోనే కాదు.. మిగిలిన రోజుల్లోనూ ఊళ్లకు చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కనీసం ఆటోలు కూడా గ్రామాలకు రావడం లేదని వాపోతున్నారు. 

అటవీ అనుమతులు రావట్లే..

జిల్లాలో రోడ్ల నిర్మాణానికి పీఆర్, ఆర్అండ్ బీ, ఐటీడీఏ అధికారులు ప్రపోజల్స్​ పంపించినా అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో మంజూరు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. మారుమూల పల్లెలన్నీ రిజర్వ్ ఫారెస్ట్ కు దగ్గరగా ఉండడంతో అటవీశాఖ రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదంటున్నారు. కడెం, పెంబి, ఖానాపూర్, మామడ, సారంగాపూర్  తదితర మండలాల్లోని మారుమూల గ్రామాల రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. పీఆర్, ఆర్అండ్​బీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.24 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు ప్రపోజల్స్​ పంపగా, ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఫారెస్ట్​ పర్మిషన్​ లేక పనులు మొదలు కాలేదు.

పీఆర్  ఆధ్వర్యంలో..

కడెం మండలం ధర్మాజీపేట నుంచి లక్ష్మీసాగర్  వెళ్లే రోడ్డుకు, మాసాయిపేట నుంచి అక్క కొండ ఆలయానికి  వెళ్లే రోడ్డుకు ఫారెస్ట్​ అనుమతులు రాలేదు. ఇదే మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామానికి కూడా రోడ్డు మంజూరైనా అటవీ అనుమతులు లభించలేదు. దీంతోపాటు పీఎంజీఎస్​వై కింద పెంబి మండలం రాసిమెట్ల నుంచి కొరటికల్ వరకు 6 కిలోమీటర్ల మేరకు అటవీ అనుమతులు రావాల్సి ఉంది. ఇదే మండలంలోని ఆర్అండ్ బీ రోడ్​ నుంచి కొసగుట్ట వరకు, ఖానాపూర్ మండలం ఎర్వచింతల నుంచి దత్తోజిపేట్ వరకు, కడెం మండలంలోని ఆర్అండ్ బీ రోడ్​ నుంచి అల్లంపల్లి వరకు 9 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రోడ్డుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కడెం మండలం పాండ్వాపూర్​ గ్రామం నుంచి డ్యామ్ గూడ గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఒకటిన్నర కిలో మీటర్​ మేర రోడ్​ నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతి రాలేదు. కాగా ఇదే మండలం రాయదారి గ్రామం నుంచి గోధుమల గ్రామం వరకు రోడ్​ పనుల కోసం రూ.2 కోట్లు మంజూరైనా అటవీ శాఖ పర్మిషన్​ జారీ చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. పంచాయతీరాజ్​శాఖ ఆధ్వర్యంలో రూ.20 కోట్లు, ఐటీడీఏ పరిధిలో రూ.3.20 కోట్లతో తయారు చేసిన ప్రపోజల్స్​ కాగితాలకే పరిమితమయ్యాయని అంటున్నారు.

ఫారెస్ట్​ పర్మిషన్​ కోసం ఎదురుచూస్తున్నాం

జిల్లాలోరూ.20 కోట్లతో రోడ్ల పనులకు ప్రతిపాదనలు  రూపొందించాం. ఫారెస్ట్​ పర్మిషన్​ రాలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు స్టార్ట్​ చేయలేకపోతున్నాం. 
– శంకరయ్య, పీఆర్​ ఈఈ, నిర్మల్

రోడ్డుపై నడవలేక పోతున్నాం
గ్రామానికి మంజూరైన రోడ్డు పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. రోడ్డుపై నడవలేక అవస్థలు పడుతున్నాం. వర్షాకాలం పక్క ఊరికి పోలేకపోతున్నాం. రోడ్డు పనులు షురూ చేయాలి. –దుల్లే వెంకటేశ్, కొత్త మద్దిపడగ, కడెం మండలం