
పన్నులు కట్టేపద్దతి ఈజీ చేస్తాం…
త్వరలో షాపింగ్ ఫెస్టివల్స్ : నిర్మల
న్యూఢిల్లీ: నిజాయితీగా పన్నులు చెల్లించే వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పన్నుల వ్యవస్థను ఇంకా సులభతరం చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సెయిట్) ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. జీఎస్‌టీ ఫైలింగ్స్‌ను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం అందరి నుంచి సలహాలను తీసుకుంటోందన్నారు. వివిధ స్టాక్ హోల్డర్లు ఇచ్చిన సలహాల మేరకు పన్నుల వ్యవస్థను ప్రభుత్వం సులభతరం చేస్తోందన్నారు. ట్యాక్స్ ఆఫీసర్ల నుంచి పన్ను చెల్లించేవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు డిజిటల్ స్కీమ్‌ను గతేడాది అక్టోబర్‌లో తీసుకొచ్చామన్నారు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో పారదర్శకతను, జవాబుదారితనాన్ని పెంచేందుకు కంప్యూటర్ జనరేటెడ్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్(డీఐఎన్) ను తీసుకొచ్చామన్నారు.
ఇన్వెస్టిగేషన్, పెనాల్టీ, అప్పీల్, రెక్టిఫికేషన్ వంటి అన్ని సేవలను కూడా ఈ డీఐఎన్ సిస్టమ్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో డీఐఎన్ సిస్టమ్ అక్టోబర్1, 2019 నుంచి అమలులోకి వచ్చింది. పన్నులు చెల్లించేవారు ఫేక్ నోటీసులు, లెటర్లు గుర్తించడానికి కూడా ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందన్నారు. దేశమంతటా షాపింగ్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తామని అన్నారు. దుబాయ్ మెగా షాపింగ్ ఫెస్టివల్స్ వంటివి 2020 మార్చి నుంచి ఇండియాలో కూడా నిర్వహిస్తామని గతేడాడి సెప్టెంబర్‌లోనే ఆర్థిక మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుంటోంది. ఈ షాపింగ్ ఫెస్టివల్స్‌లో ట్రేడర్లు పెద్ద ఎత్తున తమ వస్తువులను అమ్ముకోవడానికి వీలుంటుంది.