గరీబ్​ కల్యాణ్​.. దేశ్ కా కల్యాణ్​

గరీబ్​ కల్యాణ్​.. దేశ్ కా కల్యాణ్​
  • గరీబ్​ కల్యాణ్​.. దేశ్ కా కల్యాణ్​
  • 2047 నాటికి పేదరికం లేని భారత్​ మా లక్ష్యం
  • బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల
  • పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు
  • ప్రజల ఆదాయం దాదాపు 50శాతం పెరిగింది
  • పేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
  • సోషల్​ జస్టిస్​ కొందరికి పొలిటికల్​ స్లోగన్​.. దాన్ని మేం ఆచరిస్తున్నం
  • అవకాశాలు సృష్టించడంలో మనకు ఆకాశమే హద్దు
  • మోదీ స్లోగన్​ ‘జై జవాన్​.. జై కిసాన్​.. జై విజ్ఞాన్​.. జై అనుసంధాన్’ అని వెల్లడి

న్యూఢిల్లీ: పేదల అభ్యున్నతికి, పేదిరక నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే.. దేశ సంక్షేమం (గరీబ్​ కల్యాణ్​.. దేశ్​కా కల్యాణ్​) అని పేర్కొన్నారు. 2047 నాటికి పేదిరకం లేని భారత్​గా దేశాన్ని నిలబెట్టడమే తమ లక్ష్యమని, పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని ఆమె తెలిపారు. 2024  ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను గురువారం పార్లమెంట్​లో నిర్మల ప్రవేశపెట్టారు. బడ్జెట్​ ప్రసంగాన్ని చదివారు. పదేండ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులు, భవిష్యత్​ లక్ష్యాలను  వివరించారు. బడ్జెట్​లో ఆమె కీ పాయింట్స్​ చెప్తున్నప్పుడు ప్రధాని మోదీ సహా బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. 

పేదరికం, అసమానతలు లేని దేశంగా..!

ఎన్నో సవాళ్ల నడుమ 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిందని నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఈ పదేండ్లలో అన్నిరంగాల్లో మార్పు కోసం మోదీ నాయకత్వంలో కృషి చేశామని, అది మంచి ఫలితాలను ఇస్తున్నదని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త జోష్​ కనిపిస్తున్నదని, అభివృద్ధి ఫలాలు ఆఖరి వరుస వారికి కూడా అందుతున్నాయని పేర్కొన్నారు. కరోనా లాంటి ప్యాండమిక్​ను కూడా ఎదుర్కొని దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడిందని తెలిపారు. అభివృద్ధి అనేది గ్రామాల నుంచి జరగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

‘‘హౌసింగ్​ ఫర్​ ఆల్.. హర్​ ఘర్​ జల్​.. ఎలక్ట్రిసిటీ ఫర్​ ఆల్​..  కుకింగ్​ గ్యాస్​ ఫర్​ ఆల్​.. బ్యాంక్​ అకౌంట్​, ఫినాన్స్​ సర్వీస్​ ఫర్​ ఆల్​ వంటి కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్​ స్కీమ్​ అమలవుతున్నది. రైతులకు మద్దతు ధర లభిస్తున్నది. అన్నిరంగాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి” అని ఆర్థిక మంత్రి వివరించారు.  పేదరికం, అసమానతలు లేని దేశంగా భారత్​ను తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నామని, 2047 వరకు వికసిత్ భారత్​ కల సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్​ నిలిచేందుకు ఈ బడ్జెట్​ ఓ గ్యారంటీ అని పేర్కొన్నారు. 

నాలుగు వర్గాలకు టాప్​ ప్రయారిటీ

సోషల్​ జస్టిస్​ అనేది కొందరికి పొలిటికల్​ స్లోగన్​గా మారిందని, కానీ దాన్ని తమ ప్రభుత్వం ఆచరణలో చూపిస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. కుల, మత, ఆర్థిక బేధాలు లేకుండా అన్నివర్గాలకు సమానవకాశాలు కల్పిస్తున్నామని, సామాజిక న్యాయం అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఉన్నవి నాలుగు కులాలేనని.. అవి పేదలు, మహిళలు, యువత, రైతులు అని తెలిపారు.

తమ ప్రభుత్వం ఈ నాలుగు వర్గాల అభివృద్ధికి టాప్​ ప్రయారిటీ ఇస్తున్నదని పేర్కొన్నారు. పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి స్వేచ్ఛను పొందారని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని చెప్పారు. మహిళలు అన్నిరంగాల్లో రానిస్తున్నారని,  నారీశక్తి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు 30 కోట్ల ముద్ర యోజన లోన్లు ఇచ్చామని ఆమె చెప్పారు. ట్రిపుల్​ తలాక్​ను నిషేధించామని.. లోక్​సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు దక్కుతున్నాయని వివరించారు.

పీఎం ఆవాస్​ యోజన కింద  పేదలకు ఇండ్లు కట్టిస్తున్నామని, ఇందులో 70 శాతం మహిళల పేర్ల మీదనే ఇస్తున్నామని, ఇది ఆడబిడ్డ డిగ్నిటీకి ప్రతీక అని పేర్కొన్నారు. పీఎం ఆవాస్​ యోజన కింద 3 కోట్ల ఇండ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని, వచ్చే ఐదేండ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం చేపడ్తామని ప్రకటించారు. దేశాన్ని పోషిస్తున్న అన్నదాతకు అండగా నిలుస్తున్నామని, వ్యవసాయానికి సాంకేతికను జోడిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్​ సమ్మాన్​యోజన కింద పెట్టుబడి సాయం ఇస్తున్నామని గుర్తుచేశారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని లోన్లు అందించామని పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా కులవృత్తుల వారికీ ఆర్థిక భరోసా దక్కుతున్నదని ఆమె తెలిపారు. 

జీడీపీకి కొత్త అర్థం

గ్రాస్​ డొమెస్టిక్​ ప్రాడెక్ట్​ (జీడీపీ)కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కొత్త అర్థం చెప్పారు. దేశ జీడీపీలో మంచి అభివృద్ధి కనిపిస్తున్నదని, జీడీపీ అంటే..  ‘గవర్నెన్స్​, డెవలప్​మెంట్​, ఫర్​ఫార్మెన్స్’ అని పేర్కొన్నారు. సిటిజన్​ ఫస్ట్​ అనేది తమ నినాదామని అన్నారు. ప్రజల ఆదాయం యావరేజ్​గా  50శాతం పెరిగిందని, కరోనాలాంటి కష్టకాలంలోనూ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, లక్ష్యద్వీప్​ లాంటి ప్రాంతాల్లో టూరిజం డెవలప్​మెంట్​కు కట్టుబడి ఉన్నామని వివరించారు. కరోనా లాంటి ప్యాండమిక్​ను చాలెంజ్​గా ఎదుర్కొని కూడా జీ20 సమిట్​కు మన దేశం ఆతిథ్యం ఇచ్చిందని, విజయవంతంగా దాన్ని నిర్వహించిందని తెలిపారు.

ఇండియా మిడిలిస్ట్​ యూరప్​ ఎకనామిక్​ కారిడార్​తో మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ‘‘మిషన్​ ఫర్​ వికసిత్​ భారత్​.. లక్ష్యంగా ముందుకు వెళ్తున్నం. వచ్చే ఐదేండ్లలో ఇది సాధ్యమవుతుంది. లాల్​బహుదూర్​ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ‘జైజవాన్​.. జై కిసాన్’ అని పిలుపునిస్తే.. వాజ్​పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ‘జై జవాన్​.. జై కిసాన్​.. జై విజ్ఞాన్​’ అని పిలుపునిచ్చారు... ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ‘జైజవాన్​.. జై కిసాన్​.. జైవిజ్ఞాన్​.. జై అనుసంధాన్’ అని ముందుకు సాగుతున్నారు” అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. 

కొత్త మెడికల్​కాలేజీల కోసం కమిటీ

నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ –2020 ద్వారా విద్యారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల అన్నారు. స్కిల్​ ఇండియా మిషన్​ ద్వారా 1.4 కోట్ల మంది యువత శిక్షణ పొందారని తెలిపారు. పదేండ్లలో కొత్తగా 3వేల ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్​ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్​, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైద్య వృత్తిని చేపట్టాలని చాలా మంది భావిస్తుంటారని,  వారి కలలను సాకారం చేసేందుకు కొత్త మెడికల్​ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్త మెడికల్​ కాలేజీల ఏర్పాటు కోసం కమిటీని నియమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అవకాశాలను సృష్టించడంలో ఆకాశమే హద్దుగా మన దేశం ముందుకు వెళ్తున్నదన్నారు.

ఆటల్లో సత్తా చాటుతున్న యువత

స్పోర్ట్స్​లో మన దేశ యువత సత్తా చాటుతున్నదని నిర్మలా సీతారామన్​ కొనియాడారు. ‘‘స్పోర్ట్స్​లో యువత ఎంతో ప్రతిభ కనబరుస్తున్నది. వారిని చూసి దేశం గర్విస్తున్నది. ఏషియన్​ గేమ్స్​, ఏషియన్​ పారాగేమ్స్​లో మనవాళ్లు ఎన్నో మెడల్స్​ సాధించారు.  2023 చెస్​ చాంపియన్స్​లో ప్రజ్ఞానంద్​ గట్టిపోటీ ఇచ్చాడు. ఇలాంటి ఎందరో ఆణిముత్యాలకు మన దేశం పుట్టినిల్లు. ఇండియాలో ఇప్పుడు 80 మంది చెస్​ గ్రాండ్​ మాస్టర్​లు ఉన్నారు” అని ఆమె వివరించారు.