ఐటీ రేట్లను తగ్గిస్తాం జీఎస్టీ పెంచుతాం

ఐటీ రేట్లను తగ్గిస్తాం జీఎస్టీ పెంచుతాం

నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి వ్యక్తిగత ఆదాయపు పన్నును మరింత తగ్గించడం కాగా, రెండోది జీఎస్టీ రేట్లను పెంచడం. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ కనీస శ్లాబు ఐదు శాతాన్ని మరొక శాతం పెంచుతామని ఆరుశాతం చేస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆర్థికశాఖ వర్గాలు మాత్రం పెంపు తొమ్మిది శాతం వరకు ఉండొచ్చని చెబుతున్నాయి. 12 శాతం శ్లాబ్‌ తీసేసే చాన్సులు ఉన్నాయని కూడా తెలిపాయి.

వస్తుసేవలకు డిమాండ్‌‌ను మరింత పెంచడానికి మోడీ సర్కారు వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు. ఇదే జరిగితే మధ్యతరగతికి పన్ను భారం తగ్గుతుంది కాబట్టి మార్కెట్లోకి డబ్బు రాక పెరుగుతుందని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. ‘‘మేం పరిశీలిస్తున్న అంశాల్లో వ్యక్తిగత పన్ను తగ్గింపు కూడా ఒకటి’’ అని ఢిల్లీలో శనివారం జరిగిన హిందుస్థాన్‌‌ టైమ్స్ లీడర్షిప్‌‌ సమిట్‌‌లో ఆమె ప్రకటించారు. ఎప్పటి నుంచి అమలవుతుందన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘‘బడ్జెట్‌‌ దాకా ఆగండి’’ అని బదులిచ్చారు. ‘‘పన్ను చెల్లింపుదారులకు ఐటీ ఆఫీసర్ల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. పన్ను చెల్లింపు వ్యవస్థను మరింత ఈజీ చేస్తున్నాం. ఇక నుంచి ట్యాక్స్‌‌పేయర్‌‌ ఐటీ అధికారులకు ముఖం కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉండదు. ఐటీ ఆఫీసర్లతో ఏవైనా ఇబ్బందులుంటే నేరుగా నా ఆఫీసుకు రావొచ్చు లేదా రెవెన్యూ సెక్రటరీకి ఫిర్యాదు చేయొచ్చు. ట్యాక్స్‌‌ టార్గెట్లు చేరుకోవడానికి పేయర్లను ఇబ్బందిపెట్టొద్దని ఆఫీసర్లకు మేం స్పష్టంగా చెప్పాం’’ అని అన్నారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.

ఎకానమీని బలోపేతం చేస్తాం

ఎకానమీని మరింత బలోపేతం చేయడానికి ఆగస్టు నుంచి సెప్టెంబరు వరకు ఎన్నో నిర్ణయాలు ప్రకటించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మార్కెట్లో వినిమయాన్ని పెంచడానికి బ్యాంకులకు రూ.ఐదు లక్షల కోట్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇన్‌‌ఫ్రాకు ఎక్కువ నిధులు ఇస్తున్నాం కాబట్టి మార్కెట్‌‌కు మేలు జరుగుతుందని చెప్పారు. ఎకానమీ అభివృద్ధికి మరిన్ని ప్యాకేజీలు ఇస్తారా ?  అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇక ముందు కూడా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. మనదేశ జీడీపీ వృద్ధిరేటు సెప్టెంబరు క్వార్టర్‌‌లో ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి తగ్గిన నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ ప్రకటన చేశారు. కొన్ని రంగాలకు ప్యాకేజీలు ఇచ్చినా, కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ను తగ్గించినా, సంపన్నులపై అదనపు సర్‌‌చార్జిని రద్దు చేసినా జీడీపీ పెరగలేదు. కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1.45 లక్షల భారం పడుతుంది. ద్రవ్యలోటు కూడా పెరుగుతుందని రేటింగ్‌‌ ఏజెన్సీలు హెచ్చరించడం తెలిసిందే.

కనీస జీఎస్టీ తొమ్మిదిశాతం ?

ఇప్పుడు ఉన్నట్టుగా జీఎస్టీ రేట్లను కొనసాగించడం సాధ్యం కాదని, వీటిని మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కనీస జీఎస్టీని ఐదు శాతం నుంచి ఆరు శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. సిగరెట్లపై మరింత పన్ను వేస్తామని తెలిపారు. మరింత ఈజీగా జీఎస్టీ చెల్లించేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.  జీఎస్టీ రిటర్నింగ్‌ సిస్టమ్‌ మరింత సులభంగా చేసేందుకు సలహాలు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. అన్ని జీఎస్టీ ఆఫీసులూ సలహాలను తీసుకుంటాయని ప్రకటించారు.   ఇదిలా ఉంటే, జీఎస్టీ ఐదు శాతం స్లాబును 10 శాతం చేస్తారని, 12 శాతం శ్లాబును రద్దు చేస్తారని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. అంతేగాక 243 వస్తువులను, సేవలను 18 శాతం శ్లాబులోకి తీసుకొస్తారని పేర్కొన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.లక్ష కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిన వాటిని కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. జీఎస్టీని 2017 జూలై నుంచి అమల్లోకి తెచ్చారు.