న్యూయార్క్ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. ‘100 వరల్డ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ లిస్ట్’లో ఆమె 34వ ర్యాంక్ పొందారు. దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా పేరొందిన నిర్మల, అంతకుముందు రక్షణమంత్రిగానూ పనిచేశారు. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం ఆమెకు ఇదే మొదటిసారి. ఈ లిస్ట్‌లో వరుసగా తొమ్మిదోసారి కూడా జర్మన్ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ టాప్‌లో నిలిచారు. ఆమె తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డె రెండో స్థానంలో, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కూడా ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణి నాడార్ మల్హోత్రా 54వ స్థానంలో, బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా 65వ స్థానంలో నిలిచారు. మల్హోత్రా హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌కు సీఈవోగా పలు వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకున్నారు. కంపెనీ సీఎస్‌ఆర్ కమిటీకి కూడా ఆమె ఛైర్‌పర్సన్. శివ్ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్న ఈ కమిటీ, ఎడ్యుకేషన్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తోందని ఫోర్బ్స్ చెప్పింది. ఇండియాలో టాప్ కాలేజీలను, స్కూళ్లను నెలకొల్పినట్టు పేర్కొంది. ప్రభుత్వాల్లో, వ్యాపారాల్లో, మీడియాలో, దాతృత్వ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను తీసుకుని ఈ లిస్ట్‌ను రూపొందించినట్టు ఫోర్బ్స్ చెప్పింది. నిర్మలా సీతారామన్ ఈ లిస్ట్‌లో తొలి సారి చోటు దక్కించుకున్నారని పేర్కొంది. ఈ లిస్ట్‌లో 100వ స్థానంలో నిలిచిన పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా థన్‌బర్గ్ వయసు కేవలం పదహారేళ్లే. చరిత్రలోనే తొలిసారి అతిపిన్న వయసు కల అమ్మాయి, ఫోర్బ్స్ అత్యంత పవర్‌ఫుల్ ఉమెన్ లిస్ట్‌లో చేరారు. మిలిండా గేట్స్, ఐబీఎం సీఈవో గిన్నీ రోమెటీ, న్యూజీలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్, ఇవాంకా ట్రంప్, సెరీనా విలియమ్స్ సరసన గ్రేటా నిలవడం విశేషం.
