నిర్మలా సీతారామన్​ది అవగాహనా రాహిత్యం: మంత్రి సత్యవతి రాథోడ్‌

నిర్మలా సీతారామన్​ది అవగాహనా రాహిత్యం: మంత్రి సత్యవతి రాథోడ్‌

కొరటికల్‌లో అజయ్  పర్యటన

చౌటుప్పల్‌/సంస్థాన్‌నారాయణపురం, వెలుగు :  కేసీఆర్‌ ప్రధాని కావాలని శ్రీరాముడికి మొక్కుకున్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రధాని అయితే అన్ని రాష్ట్రాల్లో కల్యాణలక్ష్మి, రైతు బంధు అమలు చేస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని..రాహుల్‌ గాంధీ చేసేది జోడా యాత్ర కాదని, చోడో యాత్ర అని ఎద్దేవా చేశారు. మునుగోడులో ఫలితాలు వచ్చాక బలుపు ఎవరిదో, వాపు ఎవరిదో తేలుతుందన్నారు.

ఇద్దరు మహిళా మంత్రులున్నామని తెలియదా? 

రాష్ట్రంలో ఇద్దరు మహిళా మంత్రులుంటే, అసలు మహిళల ప్రాతినిధ్యమే లేనట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడడం ఆమె అవగాహనారాహిత్యానికి నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమె యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో పర్యటించారు. ఆమె మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న హామీల అమలు కోసం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయించలేకపోయారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ఆమె తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

పార్టీ అన్నాక చిన్న చిన్న సమస్యలుంటాయ్

మునుగోడు : పార్టీ అన్నాక కార్యకర్తల మధ్య చిన్న చిన్న సమస్యలుంటాయని, వాటిని పట్టించుకోకుండా సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి టీఆర్‌ఎస్‌ విజయం కోసం పనిచేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​..ముఖ్య కార్యకర్తలకు సూచించారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌లో ఆదివారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ విధానాలను ప్రశ్నించే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేకపోవడం వల్లే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశారన్నారు. అనంతరం దళితవాడలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తం, సీపీఐ మండల  కార్యదర్శి చాపల శ్రీను, వెంకటేశ్‌, కొరటికల్‌ సర్పంచ్ పద్మ లింగయ్య పాల్గొన్నారు.