భారత్, అమెరికా తొలి సంయుక్త ప్రయోగం సక్సెస్.. అంతరిక్షంలోకి చేరిన నిసార్

భారత్, అమెరికా తొలి సంయుక్త ప్రయోగం సక్సెస్.. అంతరిక్షంలోకి చేరిన నిసార్

శ్రీహరికోట: భారత్, అమెరికా అంతరిక్ష సంస్థలు ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన తొలి ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపగలిగే ‘నాసా–ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (నిసార్)’ ఉపగ్రహం సక్సెస్​ఫుల్‎గా అంతరిక్షంలోకి చేరింది. ఏపీలోని శ్రీహరికోట ‘షార్’ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ 19 నిమిషాల ప్రయాణం తర్వాత నిసార్ శాటిలైట్‎ను నిర్దేశిత 745 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేర్చింది. 

ఐదేండ్లపాటు సేవలు అందించే నిసార్ శాటిలైట్ 3 నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. నిసార్ శాటిలైట్ ప్రాజెక్టును ఇస్రో, నాసా పదేండ్ల క్రితం ప్రారంభించాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఇందులో రెండు ఫ్రీక్వెన్సీలతో కూడిన ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ రాడార్లను అమర్చారు. ఎల్ బ్యాండ్ రాడార్‎ను నాసా, ఎస్ బ్యాండ్ రాడార్‎ను ఇస్రో తయారు చేశాయి. 12 మీటర్ల వెడల్పుతో కూడిన భారీ యాంటెన్నాను జోడించారు. 2,393 కిలోల బరువైన ఈ శాటిలైట్ తయారీకి 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.

12 రోజులకోసారి మొత్తం భూగోళం డేటా.. 

భూమి చుట్టూ ప్రతి 97 నిమిషాలకు ఓసారి తిరిగి వచ్చే నిసార్ శాటిలైట్ ప్రతి 12 రోజులకు ఓసారి మొత్తం భూగోళ ఉపరితలాన్ని కొండలు, అడవులు, సముద్రాలు, హిమాలయాలు, గ్లేసియర్లు, ఎడారులు సహా అణువణువూ ఫొటోలు తీసి పంపనుంది. పగలు, రేయి, ఎలాంటి వాతావరణం ఉన్నా ఒక సెంటీమీటర్ స్థలంలో జరిగే మార్పులను కూడా ఇది పసిగట్టనుంది. ప్రపంచంలో ఇంతవరకూ ఏ భూ పరిశీలన ఉపగ్రహమూ అందించనంత పెద్ద ఎత్తున డాటాను ఈ శాటిలైట్ భూమికి పంపనుంది. 

ఈ ఉపగ్రహం పంపే టెరాబైట్ల కొద్దీ డేటాతో భూభాగం, మంచు ఖండాల 3డీ వ్యూను కూడా రూపొందించవచ్చు. ఇస్రో, నాసా గ్రౌండ్ సెంటర్లకు చేరే ఈ సమాచారాన్ని భారత్, అమెరికాతోపాటు ఇతర అన్ని దేశాల రీసెర్చర్లకూ అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, క్లైమేట్ చేంజ్, వరదలు, వ్యవసాయం, జల వనరుల వంటి అనేక అంశాలపై కచ్చితమైన సమాచారం అందనుంది.