చంద్రయాన్ 3తో సత్తా చాటినం..దేశాభివృద్ధిలో యువతే కీలకం

చంద్రయాన్ 3తో సత్తా చాటినం..దేశాభివృద్ధిలో యువతే కీలకం
  •    వరంగల్  నిట్ కాన్వొకేషన్​లో వీకే సారస్వత్
  •     ఇక్కడ స్టార్టప్​లకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య

కాజీపేట, వెలుగు : దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మభూషణ్  అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్  అన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ తో మన దేశ సత్తా ప్రపంచానికి మరోసారి తెలిసిందని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌‌ నిట్‌‌లో శనివారం  21వ కాన్వొకేషన్‌‌  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మంది విద్యార్థులకు సారస్వత్  గోల్డ్ మెడల్స్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విజయవంతంగా గ్రాడ్యుయేషన్  పూర్తిచేసి పట్టాలు అందుకున్న స్టూడెంట్లకు అభినందనలు తెలిపారు. వరంగల్  నిట్​ వంటి ప్రముఖ విద్యాసంస్థ స్నాతకోత్సవంలో పాల్గొనడం తనకు గౌరవంగా ఉందన్నారు. ఇక్కడ కొత్త స్టార్టప్​లను నెలకొల్పడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు.

“ శక్తి అంత నీలోనే ఉంది. మీరు ఏదైనా చేయగలరు. మిమ్మల్ని మీరు నమ్మండి ’’ అన్న స్వామి వివేకానందుడి మాటలను ఆయన గుర్తుచేశారు. నిట్​ డైరెక్టర్  బిధ్యాధర్  సుబుధి మాట్లాడుతూ ఎన్‌‌ఐటీ వరంగల్  పరిశోధనల్లో అనూహ్యమైన వృద్ధి సాధించిందన్నారు. 583 జర్నల్‌‌లను ప్రచురించి దాదాపు 7.5 కోట్ల కన్సల్టింగ్, ప్రాజెక్ట్ గ్రాంట్లు పొందిందని తెలిపారు. క్యాంపస్  రిక్రూట్‌‌మెంట్ డ్రైవ్‌‌ల ద్వారా 98 శాతం మంది విద్యార్థులు ప్లేస్‌‌మెంట్ ఆఫర్‌‌లు పొందారన్నారు. ఫార్చ్యూన్  వంటి కంపెనీలు ఇక్కడి విద్యార్థులను రిక్రూట్  చేసుకోవడానికి క్యాంపస్‌‌ని సందర్శించాయని ఆయన తెలిపారు. మొత్తంగా ఈ కాన్వకేషన్‌‌లో 2,029 మంది అభ్యర్థులు డిగ్రీలు అందుకున్నారు. బయోటెక్నాలజీ విభాగంలో నివేదిత ఉలగనాథన్,  సివిల్ ఇంజనీరింగ్ లో యాదరి రేవంత్, ఎలక్ట్రికల్  అండ్ ఎలక్ర్టానిక్స్ విభాగంలో కరప భవానీ శంకర్, మెకానికల్ ఇంజనీరింగ్​లో చిన్ని రేవంత్, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్​ లో మద్ది సుదీప్తి, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగంలో ఎం.తరుణ్, కెమికల్ ఇంజనీరింగ్​లో ప్రత్యూష్ దాల్, కంప్యూటర్  సైన్స్ అండ్  ఇంజనీరింగ్​లో సుధిరెడ్డి దినేష్ రెడ్డి బంగారు పతకాలు అందుకున్నారు.