సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం (జూన్ 14) సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో బీహార్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. MNREGA కింద నిబంధనలతో బీహార్ నిరుద్యోగ భృతి రూల్స్ 2024 కి ఆమోదం తెలిపింది.
నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులు
ఈ పథకం కింద చదువుకున్న నిరుద్యోగ యువకులందరికీ వారి ఉద్యోగం వెతుకుతున్న సమయంలో వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి నెలవారీ భత్యం 1,000 అందిస్తుంది. ఈ పథకం ప్రయోజనాన్ని అర్హులైన నిరుద్యోగ యువకులు రెండు సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి అందుకుంటారు.
కొత్తగా ఆమోదించబడిన నిబంధనల ప్రకారం.. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత నిరుద్యోగులుగా మిగిలిపోయిన అర్హులైన యువతకు దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజులలోపు ఉపాధిని పొందకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోజువారీ నిరుద్యోగ భృతిని అందుకుంటారు. ఈ భత్యం వారి దరఖాస్తు తేదీ నుంచి ప్రారంభించి నిర్ధిష్ట పరిమితుల్లో ఆర్థిక సాయం అందించడం ద్వారా ఉపాధి కోరుకునే వ్యక్తులకు సాయం చేస్తుంది.
25 అజెండాలకు బీహార్ కేబినెట్ ఆమోదం
లోక్ సభ ఎన్నికల తర్వాత శుక్రవారం సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 25 అజెండాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీహార్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బీహార్ యువతకు మేలు చేసే లక్ష్యంతో సీఎం నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మక చర్యగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.