అధికారంలోకి వస్తే.. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా

అధికారంలోకి వస్తే.. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు కలిసి కేంద్రంలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. దేశంలోని అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. పాట్నాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. " 2024లో బీజేపీయేతర పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ఇది కేవలం  బీహార్ రాష్ట్రం గురించి మాత్రమే కాదు. ప్రత్యేక హోదా పొందాల్సిన ఇతర రాష్ట్రాల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను" అని నితీశ్ పేర్కొన్నారు.

2007 సంవత్సరం నుంచే.. 

2007 సంవత్సరం నుంచే బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీశ్ కుమార్  డిమాండ్ చేస్తున్నారు.  బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా నితీష్ ఈ డిమాండ్ ను లేవనెత్తారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఉంది.  

బీజేపీతో విడిపోయి..  

గత నెలలో నితీశ్ కుమార్ బీజేపీతో విడిపోయి..  ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  మరో రెండేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో  బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ తో సహా ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశమయ్యారు.  ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి నితీశ్ కుమారే అంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటి అలోచన లేదని నితీశ్ పలు సందర్భాల్లో చెప్పారు.